ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ముంగిట భారత్ 540 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసంది. అటు భారత్ మాత్రం విజయానికి మరో ఐదు వికెట్ల దూరంలో వుంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం మిగిలివుండటంతో ఈ మ్యాచ్ ఫలితం రావడం ఖాయంగా తెలుస్తుంది.
అంతకుముందు.. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడారు ఫలితంగా ఏడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అగర్వాల్ (62), పుజారా (47) చొప్పున పరుగులు చేసి తొలి వికెట్‌కు 107 పరుగులు చేశారు. ఆ తర్వాత గిల్ 47, కెప్టెన్ కోహ్లీ 36, అక్షర్ పటేల్ 26 బంతుల్లో 41 పరుగులు చేశారు. ముఖ్యంగా కివీస్ బౌలర్లను పటేల్ చీల్చిచెండాడు.
మరోవైపు, కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ మరోమారు రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో ముంబై టెస్టులో అజాజ్ పటేల్ ఏకంగా 14 వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 540 పరుగుల విజయలక్ష్య ఛేదన కోసం కివీస్ ఆటగాళ్లు బరిలోకి దిగారు.
తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ జట్టు కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలుపుకుని మొత్తం 540 రన్స్‌ను టార్గెట్‌గా భారత్ నిర్ధేశించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు... 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ లాథమ్ 6, విల్ యంగ్ 20, రాస్ టేలర్ 6, బ్లండెల్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం హెన్రీ నికోల్స్ 36, రచిన్ రవీంద్ర 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, అక్షర్ పటేల్ ఒక వికెట్ చొప్పున తీశాడు.