చాలామంది సినిమాల్లో విలన్లుగా నటిస్తుంటారు. అయితే వారు సినిమాల వరకు మాత్రమే విలన్లు. నిజ జీవితంలో చాలామంది హీరోలే. అందులో ఏ మాత్రం సందేహం లేదని నిరూపిస్తున్నాడు సోనూసూద్. ఈ పేరు వింటేనే ఠక్కున అనుష్క సినిమాలో భేతాళ మాంత్రికుడు గుర్తుకు వస్తాడు.
అంతేకాకుండా కండలు తిరిగిన విలన్లలో విలక్షణమైన నటుడు సోనూసూద్. తెలుగులో తెలియకపోయినా బాలీవుడ్ నుంచి వచ్చినా తనకు ఇచ్చిన క్యారెక్టర్‌కు మాత్రం న్యాయం చేస్తాడు..చేస్తూనే ఉన్నాడు. గంభీరంగా కనిపించే సోనూసూద్‌లో రియల్ హీరో ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నాడు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన 350 మంది వలస కూలీలు పని నిమిత్తం మహారాష్ట్రకు వెళ్ళారు. లాక్ డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయారు. తినడానికి తిండిలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వాట్సాప్ వీడియోల ద్వారా చూశాడు సోనూసూద్. వెంటనే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడారు.
350 మంది వలస కూలీలు కర్ణాటకకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. స్వయంగా బస్సులను కూడా తన సొంత ఖర్చు పెట్టి స్వస్థలాలకు చేరుస్తున్నాడు. సోనూసూద్ తమను స్వస్థలాలకు చేరుస్తున్నారని తెలుసుకున్న వలసకూలీలు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు.