ప్రస్తుతం కరోనా మహమ్మారి బారినపడి చాలామంది చనిపోతున్నారు. ఇళ్ళు వదిలి బయటకు రాకూడదని చాలామంది అనుకుంటున్నా.. కొంతమంది యువత మాత్రం ఏమీ కాదులే అనుకుని రోడ్లపై ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు. మరికొంతమంది మాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. అవసరమైతే తప్ప రోడ్లపైకి రావడం లేదు.
అయితే ప్రభుత్వాలు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడూ బిజీగా ఉండే నగరి ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గ ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లాక్ డౌన్‌తో ఎవరూ పస్తులు ఉండకూడదని ఇప్పటికే ఆమె తన సొంత ట్రస్ట్ రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బియ్యం, కందిపప్పును అందజేశారు.
అలాగే మరికొన్ని నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. అంతే కాకుండా నిరాశ్రయులు, నిరుపేదలు, అభాగ్యుల కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నం పూట భోజనం కూడా పెడుతున్నారు. అంతే కాకుండా నియోజకవర్గంలో తిరుగుతూ కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరూ ఇంటి నుంచి రావద్దని కోరుతున్నారు.
ఎప్పుడూ బిజీగా ఉండే రోజా నగరిలో ఇంటి పట్టునే ఉంటూ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఎవరికీ కరోనా వైరస్ సోకుండా జాగ్రత్తపడుతున్నారు. నగరి, పుత్తూరు మున్సిపల్ అధికారులతో చర్చిస్తున్న రోజా అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా రోజా చేస్తున్న సేవలను పలువురు కొనియాడుతున్నారు.