కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న యుద్ధంలో కొన్ని విభాగాలకు చెందిన సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలాంటివారిలో ముఖ్యంగా ఆరోగ్యం సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. ఇలాంటి వారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాకుండా, ఈ విభాగాలకు చెందిన వారికి పూర్తి వేతనాన్ని చెల్లిస్తామని తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వైద్య ఆరోగ్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి మరింత ప్రోత్సాహం, మద్దతు అందించే చర్యల్లో భాగంగా పూర్తి జీతం ఇస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో కష్టమైనా కూడా వారికి అండగా నిలవాలని నిర్ణయించామని తెలిపారు. ఇక ఇతర విభాగాల ఉద్యోగులకు పూర్తిజీతాలు కాస్త ఆలస్యమవుతాయని తెలిపారు.
మరోవైపు, ఢిల్లీలో జరిగిన మత సమ్మేళనానికి అనేకమంది విదేశీయులు వచ్చారని, ఆ సమావేశానికి ఏపీ నుంచి కూడా వెళ్లారని తెలిపారు. అయితే ఆ సమావేశానికి వచ్చిన విదేశీయులకు కరోనా వైరస్ ఉండడంతో మనవాళ్లు కూడా కరోనా బారినపడ్డారని, ఇది దురదృష్టకరమన్నారు. అది ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక సమావేశం అయినా ఇలాగే జరగవచ్చని అభిప్రాయపడ్డారు.
మనదేశంలో అన్ని మతాల్లోనూ పెద్దలు ఉన్నారని, రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సమ్మేళనాల్లో, జగ్గీ వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ సమావేశాల్లో, మాతా అమృతానందమయి సభల్లో, పాల్ దినకరన్, జాన్ వెస్లీ తదితరుల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగొచ్చని, అయితే వాటిని ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనల్లా చూడకుండా, దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనల్లా చూడాలని హితవు పలికారు. ఓ మతానికో, ఓ కులానికో దీన్ని ఆపాదించి, వారు కావాలనే చేసినట్టుగా ఆరోపించే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బాధితులపై ఆప్యాయత ప్రదర్శించాలని, మనవాళ్లను మనమే వేరుగా చూడరాదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనను ఓ వర్గం మీద ముద్రవేసేందుకు వాడుకోవద్దని సూచించారు.
'కరోనా కాటుకు మతాలు లేవు, కరోనా కాటుకు కులాలు లేవు, కరోనా కాటుకు ప్రాంతాలు లేవు. ధనిక, పేద అన్న తేడా అస్సలు లేదు. రాష్ట్రాలు, దేశాలన్న తేడా లేదు. దీనిపై భారతీయులుగా సమైక్యంగా పోరాడుదాం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇవే సూచనలు చేశారు. చీకట్లు నింపుతున్న కరోనాపై ఆదివారం రాత్రి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి పోరాడుదాం' అని పిలుపునిచ్చారు.