కూతురు మరణించిన వార్తనే తండ్రి జీర్ణించుకోలేకపోతాడు. అలాంటి కుమార్తె మరణించిందని తెలిసి.. ఆ ప్రాంతానికి రాలేక.. అంత్యక్రియలు చూడలేకపోతే.. ఆ తండ్రి పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే తరహా బాధనే ఓ తండ్రి అనుభవించాడు. రోజూ వీడియో కాల్‌తో తనను పలకరించే తన కూతుర్ని చివరి సారి అదే వీడియో కాల్‌లో శ్మశానానికి పంపాల్సి వచ్చింది.
మాటల్లో వర్ణించలేని అలాంటి బాధను ఇప్పుడు జగిత్యాలకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి అనుభవించాడు. తన కుమార్తె చివరి చూపును సైతం చూడలేకపోయాడు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన పాలాజీ భాస్కర్ అనే వ్యక్తి ఉపాధి కోసం ఐదు నెలల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అతడి కుమార్తె గత కొన్ని రోజులుగా డయాబెటిస్‌తో బాధపడుతోంది.
ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. కరోనా నేపథ్యంలో భారత్ లాక్ డౌన్ ప్రకటించగా.. దుబాయ్‌లోనే ఇరుక్కుపోయిన భాస్కర్.. తన కుమార్తె అంత్యక్రియలకు రాలేకపోయారు. దీంతో చేసేదేంలేక తన గారాలపట్టి అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసి.. కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలిసి స్థానికులు సైతం కంట తడి పెట్టుకున్నారు.