తెలంగాణా రాష్ట్రంలో అదుపులో ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీనికి కారణం ఢిల్లీలోని మర్కజ్ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమమే కారణమని తేలింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌తో పాటు.. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అనేక మంది వెళ్లి పాల్గొన్నారు. అలా సుమారుగా వెయ్యి మంది వరకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్లినట్టు అధికారులు లెక్కతేల్చారు. ఇపుడు వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే తెలంగాణాలో కరోనా కట్టుతప్పి... అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టు అధికారులు గుర్తించారు.
పైగా, ఈ మర్కజ్‌లో పాల్గొన్న వారందరినీ గుర్తించి నిర్బంధ క్వారంటైన్‌కు పంపే ఏర్పాట్లను ఆగమేఘాలపై చేస్తోంది. సమావేశంలో పాల్గొన్న వారిని, వారి కుటుంబ సభ్యులను ఒప్పించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 603 మంది ఉన్నారు. వారి కుటుంబాల్లో కొందరికి పరీక్షలు నిర్వహించగా 74 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి.
మర్కజ్ మసీదు సమావేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఇప్పటికే 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజాముద్దీన్ వెళ్లినవారిలో 70 శాతం మందిని గుర్తించిన ప్రభుత్వం, 90 శాతం మంది ఫోన్ నంబర్లను సేకరించింది. మిగిలిన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు.
ఢిల్లీ వెళ్లివచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్న దాదాపు 2 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచారు. అన్ని కుటుంబాలు కలిపి దాదాపు 10 వేల మంది వరకు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే నిజమైతే.. వీరిద్వారా కరోనా విపరీతంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.