కరోనా కాలంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వచ్చే నెల 17వ తేదీ నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిర్ణయించింది. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందించేందుకు సిద్ధమైంది.
యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగతా వారిని మాత్రం ప్రస్తుతం ఎలాంటి పరీక్షలూ లేకుండా పై తరగతులకు పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తున్నామన్నారు. విద్యావ్యవస్థ బలోపేతం, రెవెన్యూ శాఖ ప్రక్షాళనపైనే దృష్టి పెడతామన్నారు. విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు.
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యూజీసీ, ఏఐసీటీఈ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు.