Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కూడా న్యాయ సలహాలిచ్చాం: ఏపీ ఉప ముఖ్యమంత్రి

ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కూడా న్యాయ సలహాలిచ్చాం: ఏపీ ఉప ముఖ్యమంత్రి
, మంగళవారం, 14 జులై 2020 (13:35 IST)
జీవో నెంబర్.3 పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ తరుపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టులను 100శాతం స్థానిక గిరిజనులకే కేటాయించాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేసిన జీవో నెంబర్.3 ను రద్దు చేస్తూ  గత ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం అందరికీ తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని గిరిజనుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పుష్ప శ్రీవాణి స్పష్టం చేసారు. సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంగా రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ తో సమావేశమై జీవో నెంబర్.3 విషయంలో తదుపరి తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు.

సిఎం ఆదేశాలతో ఈ విషయంగా న్యాయకోవిదులను, రాజ్యాంగనిపుణులను కూడా సంప్రదించడం జరిగిందన్నారు. న్యాయ నిపుణుల సూచనలు, రాజ్యాంగంలో షెడ్యూల్ ప్రాంత వాసులకు ప్రత్యేకంగా కల్పించిన సదుపాయాలు, నిబంధనలను జోడిస్తూ రివ్యూ పిటీషన్ ను సీనియర్ న్యాయవాదుల పర్యవేక్షణలో రూపొందించడం జరిగిందని వివరించారు.

ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా తమ ప్రభుత్వం న్యాయ సలహాలను అందించడం జరిగిందని చెప్పారు. సెలవుల అనంతరం సుప్రీంకోర్టు ప్రారంభమైన వెంటనే రివ్యూ పిటీషన్ ను సుప్రీంలో దాఖలు చేసామని పుష్ప శ్రీవాణి తెలిపారు. అయితే జీవో నెంబర్.3 విషయంలో గిరిజనుల హక్కులను, ప్రయోజనాలను కాపాడే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజీపడబోదని పునరుద్ఘాటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 'ఆపరేషన్ ముస్కాన్‌' షురూ