Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ప్ర‌భుత్వం నిరంకుశ ధోర‌ణి విడ‌నాడాలి

Advertiesment
తెలంగాణ ప్ర‌భుత్వం నిరంకుశ ధోర‌ణి విడ‌నాడాలి
, శనివారం, 19 అక్టోబరు 2019 (18:59 IST)
తెలంగాణ‌ ఆర్టీసీ ఉద్యోగులు న్యాయమైన కోర్కెల కోసం చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు యన్.చంద్రశేఖర రెడ్డి, రాష్ట్ర కార్య‌ద‌ర్శి బండి శ్రీనివాసరావు, ఏపి ఎన్జీవోస్ పశ్చిమ కృష్ణ అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్‌లు పేర్కొన్నారు.

అఖిలభారత రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయ కాంపౌండ్‌లో శనివారం తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపి ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ఆర్టిసి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నెరవేర్చకపోవడంతో వారు గత 14 రోజులు నుండి తమ కోరికల సాధనకు సమ్మె చేస్తున్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరపకుండా నిరంకుశ ధోరణి అవలంభించడం సరికాదన్నారు.

ఏపీలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, దానిని తాము పూర్తిగా అభినందిస్తున్నామన్నారు. అదేవిధంగా తెలంగాణాలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా ఆచరణలో దానిని అమలు చేయకుండా మొండిగా వ్యవహరించడం శోచనీయం అన్నారు.

48 వేలమంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళితే వారితో చర్చలు జరపకుండా వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ప్రకటించడం, ఆ కారణంగా ఆందోళనతో కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా భాధాకరమని ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరంకుశ ధోరణి పనికిరాదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు రెండూ మొన్నటివరకూ కలిసి ఉండేవని, విధానపరమైన విభేధాలు ఉన్నా, కష్టం వచ్చినప్పుడు సంఘీభావం తెలపాల్సిన కనీస భాధ్యత మనపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ సంఘాలు తెలంగాణా ఆర్ టి సి ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు.

ఇప్పటికైనా తెలంగాణా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఆర్టిసి ఉద్యోగులను సంప్రదింపులకు పిలవాలన్నారు. ఇదే విధమైన మొండి వైఖరిని తెలంగాణా ప్రభుత్వం విడనాడకపోతే దేశ వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు.

ఏపి ఎన్జీవోస్ పశ్చిమ కృష్ణ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగులు గత 14 రోజులుగా వారి న్యాయమైన కోరికల కోసం పోరాడుతుంటే పట్టించుకోకుండా ఆ ప్రభుత్వం వారిని ఉద్యోగం నుంచి తొలిగిస్తునట్లు ప్రకటించడాన్ని, తెలంగాణా ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఉద్యోగుల న్యాయమైన కోరికల కోసం సమ్మె చేసే హక్కు, నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు ఉందన్నారు. కార్మికులారా ఏకం కండీ అనే నినాదాన్ని మరొకసారి తెర పైకి తీసుకువచ్చే పరిస్థితులు తీసుకు రావద్దన్నారు. తెలంగాణ‌ ఆర్టీసి ఉద్యోగులు వారి న్యాయమైన కోరికలను కోరుతూ ఎన్నో విజ్ఞప్తులు చేసినా ఆ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందన్నారు.

కార్మికుల పట్ల కనీస సానుభూతి చూపకపోగా నిరంకుశ ధోరణిలో ఉద్యోగులను తొలగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమ‌న్నారు. ఎన్నో వేల కుటుంబాలు తెలంగాణా ప్రభుత్వం మొండి వైఖరి వలన రోడ్డున పడే పరిస్థితి ఉందని దీనిని మనందరం ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

ఏపి ఎన్జీవో స్టేట్ జనరల్ సెక్రటరి బి.శ్రీనివాసరావు, పశ్చిమ కృష్ణా కార్యనిర్వాహక కార్యదర్శి పి.రమేష్, స్టేట్ ఉమెన్ వింగ్ ట్రజరర్ శివలీల, లలితాంబ, అజయ్‌కుమార్, అమరావతి ఏపి ఎన్జీవో అధ్యక్షుడు పి.రమణ, విజయవాడ నగర శాఖ కార్యదర్శి జె.స్వామి, జలవనరుల శాఖకు చెందిన లంకేశ్వరరావు, కిషోర్, పలు సంఘాల ప్రతినిధులు, మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తమ నిరసనను ఉద్యోగులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళితులు, మైనార్టీల అణచివేతకు కొన్ని శక్తుల కృషి