"ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం గారు ఎప్పుడు ఫాంహౌస్‌లో ఉంటారో?... ప్రగతిభవన్‌కు ఎప్పుడొస్తారో తెలియని దుస్థితి నెలకొంది. ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ? ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది?..సీఎం దొరగారూ! జవాబు చెప్పాలి" అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
"తెలంగాణలో కేసీఆర్ దొరగారి పాలన ఎంత అరాచకంగా ఉందో తాజా పరిణామాలే చెబుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఎన్ని అవమానాల పాలవుతున్నారో నర్సుల ఆందోళన చూస్తే తెలుస్తుంది. పోస్టింగులు, సీనియారిటీ, జీతాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన నర్సులకు జవాబు చెప్పలేక సర్కారు నీళ్ళు నములుతోంది.
మరోవైపు ఆర్టీసీ సిబ్బందికి అందిన జూన్ నెల జీతాల్లోనూ ఆందోళన నెలకొంది. దారుణమైన కోతలతో ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చిన జీతం డబ్బులతో ఎలా బతుకీడ్చాలో తెలియక వారు కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు" అని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.