వలస కార్మికులు ఇళ్లకు వెళ్ళిన తర్వాత లాక్ డౌన్ ఎత్తేయటం సరైన వ్యూహమేనా? అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై మండిపడ్డారు.
లాక్‌డౌన్ అమలుకు 4 గంటలు, ఎత్తేయటానికి వారం రోజులా? అంటూ నిలదీసిన ఒవైసీ.. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశం ఆర్థికంగా కుప్ప కూలుతోందని విమర్శించారు.. లాక్‌డౌన్ న్యాయపరంగా రాజ్యాంగ విరుద్ధం అన్న ఒవైసీ.. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యింది.
ఎలాంటి ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్ విధించారని ఆరోపించారు. ఇక, ఎఫ్‌ఆర్‌బీఎమ్‌పై కండిషన్ పెట్టడం సరైన పద్ధతికాదన్న ఆయన.. కేంద్రం వ్యవహారాల శైలి విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని.. కేసీఆర్ కేంద్రాన్ని విమర్శించడంలో ఎలాంటి తప్పులేదన్నారు.
ఇదే సమయంలో.. రాష్ట్రాలను కరోనా టైంలో ఆదుకోవడంలో కేంద్రం విఫలం అయ్యిందని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్.. రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొట్టిందని ఆరోపించిన ఆయన.. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్ 1.6 శాతం జీడీపీ మాత్రమే..10 శాతం కాదన్నారు.