Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు: మంత్రి కురసాల కన్నబాబు

Advertiesment
రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు: మంత్రి కురసాల కన్నబాబు
, బుధవారం, 27 మే 2020 (21:42 IST)
మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వినూత్న సంస్కరణకు తెరతీస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

సచివాలయం నాలుగో బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చిక ఆవరణలో మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మే 30వ తేదీన రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

వ్యవసాయ రంగం అభివృధ్ధి చేయడం ద్వారా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్న నమ్మకం తమ ప్రభుత్వానికుందన్నారు. ఈ క్రమంలో ఆర్‌బీకేల ఏర్పాటుతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని వివరించారు. రైతుల దగ్గరే స్వయంగా పంటలు కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు.

రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయశాఖ సూచనలు, సలహాలతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతుభరోసా కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్, ఇంటర్ ఫేస్, ఇంటర్ వెన్షన్ సిస్టమ్ తో పాటుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ రంగాలశాఖల అధికారుల సూచనలు, సలహాలను రైతులు నేరుగా స్వీకరించవచ్చునన్నారు.

నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, రసాయన ఎరువులు అందించే సంస్థగానే కాకుండా రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేయనున్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలవనున్నాయని భరోసానిచ్చారు.

రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకుడు, సెరికల్చర్, ఫిషరీస్ అసిస్టెంట్స్ అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలకు మార్కెటింగ్ వ్యవస్థ అనుసంధానమై ఉంటుందన్నారు. 
 
ఆర్‌బీకేలో ఉండే వీరు ప్రతిరోజు పంటకు గిట్టుబాటు ధరలను పరీక్షించడం, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం వంటి అంశాలను సమీక్షించి సంబంధించిత డేటాను పై అధికారికి పంపడం ద్వారా మార్కెటింగ్‌ శాఖ మానిటరింగ్‌ చేస్తుందని తెలిపారు. అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌ లు, టీవీలు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటుతో రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్ బీకేలు పనిచేయనున్నాయని తెలిపారు.

ఆర్ బీకేల ద్వారా వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తల నుంచి వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. ఉదాహరణకు  ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ద్వారా ఒక రైతు భరోసా కేంద్రంలో కూర్చొని శాస్త్రవేత్తలు, నిపుణులు, నాయకులు, అధికారులు మాట్లాడితే రాష్ట్రంలోని అన్ని ఆర్ బీకే లలో చూసే వీలు కల్పిస్తున్నామన్నారు.  
 
ఈ నెల 30న వ్యవసాయ,మార్కెటింగ్  శాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సమీక్ష చేయనున్నారని మంత్రి వివరించారు. ఇదే సమయంలో ఇంటర్నెట్ ద్వారా సుమారు 5లక్షల మంది రైతులతో సిఎం జగన్ నేరుగా మాట్లాడనున్నారని వెల్లడించారు.

రాష్ట్ర చరిత్రలో 5లక్షల మంది రైతులతో ఏ ముఖ్యమంత్రి మాట్లాడి ఉండక పోవచ్చునని అన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రం నుంచి సుమారు 50మంది రైతులు ఒకేసారి సిఎంతో మాట్లాడే అవకాశం లభించనుందన్నారు. రైతులతో నేరుగా మాట్లాడటం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పండుగ అని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

మే 30 తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలను వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు, పలువురు అతిథులు సందర్శిస్తారని అన్నారు.

వారం రోజులు పాటు అక్కడి వసతులను పరిశీలన చేసి మరిన్ని సూచనలు, సలహాలను అందిస్తారని పేర్కొన్నారు. జూన్ నెలలో వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు.దివంగత మాజీ సిఎం వైయస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగం అభివృద్ధికి ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగం అభివృధ్ధికి రెండు అడుగులు ముందుకు వేస్తున్నారని నిరూపించారని అన్నారు. 
 
తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని వెల్లడించారు. జూన్ 1వ తేదీన ఖరీఫ్ ప్రారంభం అవుతుండటంతో అన్ని కార్యకలాపాలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు.ఇప్పటికే జిల్లా స్థాయిలో ఆర్‌బీకేల కోసం ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ లను నియమించామని తెలిపారు.

ఆర్బీకేల పర్యవేక్షణ కోసమే జేసీని నియమించామన్నారు. రైతుకు గిట్టుబాటు ధర రాని పక్షంలో వెంటనే జోక్యంచేసుకుని, రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా సద్వినియోగంచేసే కార్యక్రమానికి ఆర్బీకేనుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. 
 
రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసి రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆర్‌బీకే స్థాయిలో ఏ పంట వేస్తే బాగుంటుందని సలహా ఇస్తామని తెలిపారు. అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులో రైతు, రైతు సంఘం నాయకులు,శాస్త్రవేత్తలు, అధికారులు, మార్కెటింగ్ ఎక్స్ పర్ట్స్, వ్యవసాయానికి సంబంధించిన పెద్దలు ఉంటారని తెలిపారు.

వీరితో పాటు ఈ కమిటీలో కౌలురైతులు,మహిళా రైతులకు స్థానం కల్పించే యోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.చిన్న, సన్నకారు రైతులకు భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతీ ఏటా ఖరీఫ్ సాగు,రబీ సాగుకు ముందుగా రైతుభరోసా కేంద్రాల ద్వారా విలువైన సమాచారం రైతులు పొందే వీలు కలుగుతుందని మంత్రి ప్రకటించారు.

దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కాంప్రహెన్సివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ప్రైజెస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌’ (సీఎం–ఏపీపీ) అనే ప్రత్యేక యాప్ తయారు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ యాప్ ద్వారా పంట వివరాలు నమోదు చేస్తారని మంత్రి తెలిపారు. సీఎంయాప్‌ ద్వారా రైతులను ఆదుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. వ్యవసాయ సహాయకుడు పంపించే డేటా సీఎం–యాప్‌కు చేరుతుందన్నారు.

తద్వారా పంట చేతికి వచ్చిందా? లేదా? ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చిందా? లేదా? ఏ రేటుకు ఆ పంటలు అమ్ముడుపోతున్నాయి? ఆ పంటల్లో ఇంటర్‌వీన్‌కావాల్సిన అవసరం ఉందా? రైతు నష్టపోకుండా పంటలను అమ్ములకుంటున్నాడా లేదా? ప్రతిరోజూ కూడా సీఎం యాప్‌ద్వారా డేటా  పంపిస్తారు. ఈ డేటా ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
రైతులకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న విషయాన్ని మంత్రి గుర్తుచేస్తూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏఒక్క రైతు గిట్టుబాటు ధరల కోసం రోడ్డు ఎక్కకూడదని సిఎం చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.గడచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ,మార్కెంటింగ్ శాఖల ద్వారా పెద్ద ఎత్తున  రైతుల పంటలను కొనుగోలు చేశామని గుర్తు చేశారు.

రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధితో పాటుగా రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  రైతు భరోసా పథకం ద్వారా ఈ ఏడాది రూ.10,209 కోట్లు రైతుల అకౌంట్లలో  జమ చేశామన్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గించడంతో పాటు, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామని, రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశామని తెలిపారు.

గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.960 కోట్లు ధాన్యం బకాయిలు కూడా చెల్లించామని, ఇంకా విత్తన బకాయిలు కూడా దాదాపు రూ.384 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ ధరతో సమానంగా ఆయిల్ ఫామ్ రైతులకు ధర కల్పించామన్నారు. ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకునేందుకు రూ.80 కోట్లు తొలిసారిగా ఇచ్చామన్నారు.

వైఎస్సార్ సున్నావడ్డీ, వడ్డీలేని రుణాలు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా వంటి పథకాల ద్వారా రైతుకు అండగా నిలిచామన్నారు. ప్రధానంగా బొప్పాయి, అరటి, టమాట వంటివే కాక  బజ్జీమిర్చి, బూడిద గుమ్మడికాయలు వంటి ఆహార పంటల ధరలు మార్కెట్లో పడిపోయిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తుచేశారు.

రైతులు కనీస మద్దతు ధర కన్నా అదనంగా పొందే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత తమదే అన్నారు. జాతీయస్థాయిలో ఆదాయం పెంచే రంగాలని ఊతమివ్వాలన్న ఉద్దేశంతో దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో  ముందుస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రైతుకు అన్ని రకాలుగా అండదండలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదన్నారు. 
 
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సబ్సిడీతో పాటు యూనిట్ రూపాయిన్నరకే అందిస్తున్నామన్నారు. తద్వారా రూ.750 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు.ఇతర దేశాల్లో, మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మిడతల దండు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందన్న ప్రచారంపై సమీక్ష చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ విషయమై అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. శాస్త్రవేత్తలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించామన్నారు. కరోనా లాంటి విపత్తు ఒకవైపు, ఆర్థిక వనరులు రాష్ట్రానికి సమకూరని పరిస్థితి మరొకవైపు బాధిస్తున్నా ఏ సంక్షేమ పథకం ఆగకుండా ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.

అర్చకులు, ఇమామ్, మౌజంలు, ఫాస్టర్లు తదితరులకి కూడా అకౌంట్ లో డబ్బులు వేశామని గుర్తుచేశారు.  ఎక్కడ అవినీతి జరిగిందో సూటిగా చెప్పాలని విపక్షాలను మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వాల కన్నా 100 శాతం తమ ప్రభుత్వం బాగా పనిచేస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. 

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి రోజూ వైద్యఆరోగ్యశాఖతో పాటు  వ్యవసాయ శాఖపై సమీక్ష చేస్తూ సలహాలు సూచనలు ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలోనే 90 శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

ఆర్బీకేలను సందర్శించిన అనంతరం తమ ప్రభుత్వ పనితీరు ఏంటో తెలుస్తుందని విపక్షాలకు సూచించారు.ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపైన వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో, రైతుభరోసా జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన పలు అంశాలను మంత్రి వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొంగ బంగారం పేరుతో టోకరా!.. ముగ్గురు అరెస్టు