కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టంపై సిఎం కెసిఆర్ అబద్ధాలు చెప్పారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ చట్టం గురించి సరిగ్గా తెలియకుంటే, జగన్ ను ఇంకోసారి భోజనానికి పిలిచి, మాట్లాడి తెలుసుకోవాలని కెసిఆర్ కు సలహా ఇచ్చారు.
అసలు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందే, వద్దంటూ అసెంబ్లీలో ఎలా తీర్మానం చేశారని ప్రశ్నించిన బండి సంజయ్, ఈ చట్టం అమలైతే, ఉద్యోగాలు ఎందుకు పోతాయో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉచిత విద్యుత్ పేరిట భారీ దొపిడీ జరుగుతోందని, కొత్త చట్టం వస్తే, తమ తమ దోపిడీ ఇక సాగబోదన్నదే టిఆర్ఎస్ నేతల భయమని ఆయన మండిపడ్డారు.
విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపిస్తామని, ముఖ్యంగా పాతబస్తీలో జరుగుతున్న విద్యుత్ చౌర్యంపై కెసిఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.