శ్రీ శ్రీ కృష్ణభగవానుడుకి ఎంతో ప్రీతిదాయకమైన మాసం దామోదర మాసం. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు జరుపుకుంటారు.కృష్ణభగవానుడుకి ఎంతో ప్రీతిదాయకమైన మాసం దామోదర మాసం. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు జరుపుకుంటారు. అసలు ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైనదో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.
ఓ రోజు కృష్ణుడు మజ్జిగ చిలుకుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్పాడు. వెంటనే యశోదా దేవి ఆపనిని ఆపి.. కృష్ణుడికి పాలు ఇస్తుండగా.. తాను వంట గదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకు దింపి తాను వంట గదిలోకి వెళ్తుంది. తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోడానికి వెళ్లిన యశోద పైన కృష్ణుడు కోపగించుకుని అక్కడ ఉన్న వెన్నకుండను పగలకొట్టి ఒక రోలు మీద కూర్చుని తినసాగాడు.
బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చుని వెన్న తింటూ కనిపించాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకుని, అక్కడ ఉన్న రోలుని కృష్ణుడి పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది. ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుడి ఉదరమునకు తక్కువైంది.
తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య, తన తల్లి తనవల్ల బాధపడకూడదని.. ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకుని కట్టించుకుంటాడు. ఇలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ దామము (తాడు)తో ఉదరముకి కట్టించుకున్నాడు. కాబట్టి ఈ మాసానికి కార్తీక దామోదర మాసము అని పేరు వచ్చింది.
అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ వుండగా.. తన ఉద్యానవనంలో ఉన్న రెండు చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోయింది. ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగడంతో.. చెట్లు రెండు వేర్లుతో సహా పెకిలించుకుని పడిపోయి శాప విముక్తి పొందుతాయి. ఇంతకీ శాపవిమోచనం కలిగిన వారు ఎవరంటే కుబేరుని కుమారులు నలకుబేర,మణిభద్రలు.
రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తుండగా అటుగా వెళ్తున్న నారద మునివర్యులని పట్టించుకోకపోవడంతో.. మద్దిచెట్లు కమ్మని శాపానికి గురైనట్లు నలకుబేర, మణిభద్రలు చెప్తారు. అయితే క్షమాబిక్ష కోరడంతో కృష్ణుడైన మీతో శాపవిముక్తి జరుగుతుందని చెప్పినట్లు వివరిస్తారు. ఇలా అర్జున చెట్లుగా ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని కృష్ణభగవానుడిని ఉద్దేశించి దామోదరాష్టకమును ఇలా పాడసాగారు.
''నమామీశ్వరం సచ్చితానందరూపం
లసత్కుండలం గోకులే భ్రాజమానం|
యశోభియోలూఖలాద్దావమానం
పరామృష్ఠమత్యంతతో ధృత్యగోప్యా ||"
ఈ దామోదర అష్టకాన్ని ఈ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు పఠించాలని అలాగే ప్రతి ఏటా ఇదే విధముగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించి యశోదా తనయునకు జేజేలు చెపుతూ తిరిగి వెళ్లిపోతారు.
ఈ కార్తీక దామోదర మాసమున భక్తులు శ్రీ కృష్ణుడుని పూజించి, నేతితో దీపముని వెలిగించి, దామోదరాష్టకమును చదివితే తమకు ఉన్న బాధలను, పాపములని తాము తీరుస్తామని, కృష్ణుడి కృప ఆ భక్తులకు ఎప్పటికీ ఉంటుందని వరాన్ని ఇస్తారు.
ఈ కార్తీక దామోదర మాసమును ప్రతి సంవత్సరం దేశములో ఉన్న అన్ని ఇస్కాన్ మందిరాలలోను జరుపుతారు. ఆశ్వీయుజ పౌర్ణమి (అక్టోబర్ 13 ఆదివారం) నుండి నవంబర్ 12వరకు (కార్తీక పౌర్ణమి) వందల వేల దీపములతో గుడిని అలంకరించి వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది. ఈ నెల రోజులూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు.
ఈ దామోదర, కార్తీక మాసంలో శ్రీ తులసీ ధాత్రీ సహిత దామోదర వ్రతం, ఉమా సహిత శంకర వ్రతం, శ్రీ శివ సోమవార వ్రతం, క్షీరాబ్ధి ద్వాదశీ వ్రతం, కేదారేశ్వర వ్రతం, శ్రీ రాధా దామోదర వ్రతం, వృషోత్సర్జనం, జ్వాలా తోరణం, అర్ధనారీశ్వర వ్రతం, కార్తికేయ వ్రతం, విష్ణు త్రిరాత్ర వ్రతం, చాతుర్మాస్య దీక్షా విరమణ, బలిపూజ చేస్తారు.
ధాన్యం, బార్లీ, జొన్నలు, గోధుమలు, కంద, సముద్రపు ఉప్పు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పనస, మామిడి, కొబ్బరి, కరక్కాయ, పిప్పళ్ళు, జీలకర్ర, శొంఠి, ఒక విధమైన ఉసిరిక, నూనెతో చెయ్యని వంటకాలు, బెల్లం తప్ప చెరకు నుంచి వచ్చే మిగిలిన పదార్థాలు తినదగినవి అని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.
అలాగే ఈ దామోదర మాసం లేదా కార్తీకంలో ఎవరైతే ప్రతిరోజూ నేతితో కేశవుని ఆలయంలో దీపం వెలిగిస్తారో.. వారికి సంతానం, ఆయుర్దాయం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని స్కంద పురాణం చెప్తోంది.