గోపాష్టమి.. కృష్ణుడు.. గోవును పూజించిన శుభదినం నేడే (నవంబర్ 16-2018). ఈ శుభదినం దీపావళికి ఎనిమిదో రోజున వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజున గోవును పూజలు చేయాలని తెలిపాడు. అంతేగాకుండా ఇదే రోజున గోపూజలు కూడా చేసేవాడని పురాణాలు చెప్తున్నాయి. గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో కడిగి.. పసుపుకుంకుమలతో అలంకరించుకోవాలి.
కొమ్ములకు రంగుల దారాలు కట్టాలి. ఆపై అరటి పండ్లను గోమాతకు నైవేద్యంగా ఇవ్వాలి. కర్పూర హారతినిచ్చి... గోవును మూడు సార్లు ప్రదక్షణలు చేయాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి. గోవుకు వెనుక భాగం నుంచి కర్పూర హారతిని ఇవ్వాలి.
దీపావళి తరువాత, కార్తీక నెల శుక్లపక్ష అష్టమిని గోపాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున అరణ్యంలోకి కృష్ణుడిని వెంట ఆవులను పంపినట్లు చెప్తారు. అందుకే ఈ రోజున ఆవులు ప్రత్యేకంగా పూజలందుకుంటాయి. ఇలా చేస్తే సమస్త దేవతలు గోమాత ఆరాధనతో సంతృప్తి చెందుతారు.
గోవులకు గోపాష్టమి రోజున పశుగ్రాసం, ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలను ఆవుకు పెడితే.. సర్వాభీష్టాలు నెరవేరుతాయి. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే మాత అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.