Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణాష్టమి పూజా విధానం... పఠించాల్సిన మంత్రాలు

కృష్ణాష్టమి పూజా విధానం... పఠించాల్సిన మంత్రాలు
, గురువారం, 22 ఆగస్టు 2019 (12:38 IST)
శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము.
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః!
ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః! 
ఈ మంత్రముతో ఈరోజు ఎవరైతే 108 సార్లు ధ్యానం చేస్తుంటారో వారి,దుఃఖం హరించిపోతుంది.
 
ఆగస్టు 23న శ్రీకృష్ణామి. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. 
 
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు.
 
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. 
 
గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము,తులసిమాల ,శ్రీ కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. తదనంతరం పూజను ప్రారంభించాలి. 
 
కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి.దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు, శ్రీమత్భావగతములతో శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది. ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి. 
 
కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి, శ్రీకృష్ణునికి పూజ చేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు చెబుతుంటారు. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. 
 
కృష్ణాష్టమి రోజున బంగారంతో గానీ, వెండితో గానీ చంద్రబింబాన్ని తయారు చేసి, వెండి లేక బంగారు పాత్రలలో ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. అంతేగాక ఈ పుణ్యదినాన భీష్మాచార్యులనుపూజిస్తే సకల పాపాలు తొలిగిపోతాయని మహర్షులు చెప్పినట్లుగా ఉంది. 
 
సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.ఓం నమో నారాయణాయ ,నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు! మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేసి తెలుపగలరు. "సర్వే జనా స్సుఖినో భవంతు", శుభం భూయాత్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-08-2019- గురువారం మీ రాశి ఫలితాలు..