Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

ramdass athawale

ఠాగూర్

, బుధవారం, 4 డిశెంబరు 2024 (13:11 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం చేజారిపోతుందనే విషయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే కలత చెందిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ సీఎం పదవిని ఆయనకు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే అభిప్రాయపడ్డారు. 
 
మహారాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి 230 సీట్లను గెలుచుకోగా వాటిలో బీజేపీకి 132, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41  సీట్లు వచ్చాయి. ఈ కూటమికి బంపర్ మెజారిటీ వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. 
 
ముఖ్యమంత్రి పదవి కోసం ఏక్‌నాథ్ షిండే పట్టుబట్టగా, కమలనాథులు మాత్రం దేవేంద్ర ఫడ్నవిస్‌ను చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. దీంతో ఏక్‌నాథ్ షిండే అలకపాన్పునెక్కారు. దీనిపై కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే స్పందించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముందు మూడు దారులు ఉన్నాయన్నారు. 
 
ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం లేదా మహాయుతి కూటమి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం లేదా కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటి ఆయన ఎంచుకోవాలన్నారు. ఈసారి బీజేపీయే ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటుందని అథవాలే స్పష్టం చేశారు. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశముందన్నారు.
 
క్రితంసారి శివసేన పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు బీజేపీకి ఎక్కువ బలం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఏక్‌నాథ్ షిండేకు ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొనసాగారన్నారు. కానీ ఈసారి కూడా సీఎం పదవిని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు. 
 
మరోసారి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు మహాయుతి కూటమిలోని బీజేపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఏక్‌నాథ్ షిండే కలత చెందిన మాట వాస్తవమే అన్నారు. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితి లేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?