శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. బిల్లులపై నిర్ణయం తీసుకునేలా గవర్నర్లకు గడువు విధించేవిధంగా రాజ్యాంగంలో సవరణలు తెచ్చేవరకు తమ పోరాటం ఆపబోమని వెల్లడించారు.
'ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయం.. ఏప్రిల్ 8 నాటి తీర్పును (తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్) ప్రభావితం చేయలేదు. వాస్తవానికి ఎన్నికైన ప్రభుత్వం డ్రైవర్ సీటులో ఉండాలని, రాష్ట్రంలో రెండు పాలక వర్గాలు ఉండకూడదని సుప్రీం తీర్పు పునరుద్ఘాటించింది. బిల్లులను పక్కన పడేసేలా వీటో అధికారం చూపే అవకాశం గవర్నర్లకు ఉండదు. బిల్లులను నిలిపివేసే అధికారం వారికి లేదు. రాష్ట్ర హక్కులు, సమాఖ్యవాదం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది' అని స్టాలిన్ స్పష్టం చేశారు.
తమిళనాడు గవర్నర్ బిల్లులను నిరవధికంగా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ ధర్మాసనం ఏప్రిల్ 8న నిర్ణయం వెలువరించింది. ఆ తీర్పు రాష్ట్రపతి, గవర్నర్ అధికారాల్లో జోక్యం చేసుకున్నట్లుగా ఉండటంతో మే 13న ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము 14 ప్రశ్నలతో సీజీఐకి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అయితే తమవద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్లు అకారణంగా, నిరవధికంగా నిలిపివేయడం తగదని, సహేతుక సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.