2019 ఆగస్టులో తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసినందుకు వికారాబాద్ జిల్లాలోని ఒక కోర్టు గురువారం 32 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నిందితుడిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించి, రూ. 10,000 జరిమానా విధించారు.
ప్రాసిక్యూషన్ ప్రకారం, ప్రైవేట్ ఉద్యోగి అయిన నిందితుడు, ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేసే తన 25 ఏళ్ల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవ జరిగేది. ఆ తర్వాత ఆమెను, ఐదేళ్ల కుమార్తెను ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హతమార్చాడు.
అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రవీణ్, ఆ తరువాత మనసు మార్చుకుని పోలీసులకు లొంగిపోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టు ముందు నిందితుడి హాజరు పరిచి జైలుకు తరలించారు. ఈ కేసును విచారించిన వికారాబాద్ జిల్లా కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.