రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన 32 యేళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఆ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్, బీఎన్ రెడ్డి నగర్ పరిధిలోని సాహెబ్ నగర్ ప్రాంతంలో జరిగింది.
ఈ ప్రాంతానికి చెందిన పారంద నరసింహ అనే వ్యక్తి పెద్ద కుమారుడు శ్రీకాంత్ (32) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఫైనాన్షియర్ల వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి చెల్లించడంలో జాప్యం తెలెత్తింది. అదేసమయంలో ఫైనాన్షియర్లు డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి వివాహం కుదిరింది. మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సివుంది.
ఈ విషయం తెలుసుకున్న ఫైనాన్షియర్లు.. అప్పు తిరిగి ఇవ్వకపోతే ఇంటికి తాళం వేసి పెళ్లిని ఆపేస్తామంటూ బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాతం.. తనకు చావు తప్ప మరోమార్గం లేదని పేర్కొంటూ, తన చావుకు కారణమైన వారిని మాత్రం వదిలిపెట్టొద్దంటూ సెల్ఫీ వీడియో ఒకటి రికార్డు చేసి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంతు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైనాన్షియర్లపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.