స్కూలుకు లేటుగా వచ్చిందనే కారణంతో టీచర్ విద్యార్థిని బలవంతంగా వంద గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ నెల 8వ తేదీన స్కూలుకు లేటుగా వెళ్లిన ఆరో తరగతి బాలికను స్కూల్ టీచర్ 100 గుంజీలు తీయాలంటూ బలవంతం చేసింది. అప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాలిక.. గుంజీలు తీయడంతో అస్వస్థతకు గురైంది.
వెంటనే ఆస్పత్రికి టీచర్లు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బ్యాగుతో పాటు గుంజీలు తీయడంతోనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లి ఆరోపించింది. బ్యాగుతో పాటే గుంజీలు తీయమని టీచర్ బలవంతం చేసిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.