Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

Advertiesment
justice gavai

ఠాగూర్

, ఆదివారం, 16 నవంబరు 2025 (15:43 IST)
భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళగిరిలో కార్యక్రమం నిర్వహించగా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
 
'సాంఘిక ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చేసిన ప్రసంగం.. ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలి. రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిర పత్రంగా చూడలేదు. కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారు. అంశం ప్రాధాన్యతను బట్టి సవరణ విధానాలను పొందుపరిచారు. 
 
కొన్ని అంశాల్లో సవరణ సులభం.. కొన్ని అంశాల్లో చాలా కఠినం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే రిజర్వేషన్ల అంశంపై మొదటి సవరణ చేసుకున్నాం. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. 1975 వరకు ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం దక్కింది. 
 
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఏడుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్‌ విధానం ఉండాలన్నది నా అభిప్రాయం. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండరాదని విశాఖ కేసు తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కొన్నేళ్లుగా మహిళలు న్యాయ విద్యలో బాగా రాణిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి' అని సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్