ఇటీవల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు రాహుల్ గాంధీ. తన నివాసం నుంచి పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మీదనే వచ్చిన రాహుల్ గాంధీ.. వినూత్నంగా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.
తాజాగా సైకిల్‌పై రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు వచ్చారు. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యవసరాల ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆ ర్యాలీలో విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. పెగాసస్ వ్యవహారం, పెట్రో ధరలు, సాగు చట్టాల రద్దు అంశంలో కేంద్ర వైఖరిని ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి.
అంతకముందు రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్‌లీడర్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. విపక్ష పార్టీ నేతలతో కాన్‌స్టూషన్ క్లబ్‌లో సమావేశం జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్, లోకతాంత్రిక్ జనతాదళ్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.
బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మనం అంతా కలిసి పోరాడాలని రాహుల్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్వరం వినిపిస్తే, మన స్వరం అంత బలంగా మారుతుందని కాంగ్రెస్ నేత తెలిపారు. విపక్ష పార్టీ నేతలతో బ్రేక్‌ఫాస్ట్ ముగిసిన తర్వాత.. రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్ యాత్ర చేపట్టారు.