పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళన ఏమాత్రం ఆగడం లేదు. కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని, పెగాసస్ స్పై వేర్‌పై విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులంతా ఇరు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలను స్పీకర్లు వాయిదావేశారు.
ముఖ్యంగా పెగాసస్‌పై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. సమావేశం ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.
మరోవైపు, విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ సైతం వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. యుద్ధవీరులకు నివాళి వాయిదాకు ముందు ఉభయ సభలు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు తెలిపాయి.
దేశాన్ని కాపాడేందుకు సైనికుల చేసిన త్యాగాల్ని కొనియాడాయి. ఈ సందర్భంగా ఎంపీలందరూ కొద్ది క్షణాల పాటు మౌనం పాటించారు. మీరాబాయికి అభినందనలు అదేసమయంలో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు పార్లమెంట్ ఉభయ సభలు అభినందనలు తెలిపాయి.
21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెయిట్లిఫ్టింగ్లో పతకం సాధించిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మీరాబాయి ప్రదర్శన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.