ఒడిశాకు చెందిన యువతికి రెండేళ్ల క్రితం పెళ్లై, మనస్పర్థలతో కొద్దినెలలకే భర్త నుంచి విడిపోయింది. మూడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ తన కాళ్లపై తాను నిలబడేందుకు ప్రయత్నించింది. అయిత ఆమె తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేస్తుండటంతో తన వ్యక్తిగత వివరాలను భారత్ మాట్రిమోనిలో అప్‌లోడ్ చేసింది.
ఆమెకు నెల క్రితం యష్ సలుజా పేరుతో ఓ యువకుడు ఫోన్ చేసి, మాట్రిమోనీ సైట్‌లో ఆమె వివరాలు చూశానని, తన బాబును ప్రేమగా చూసుకుటావన్న నమ్మకం ఏర్పడిందని చెప్పాడు. అలాగే తన తల్లి మలేసియా బ్యాంకులో 200 కోట్ల డాలర్ల నగదు (భారత కరెన్సీలో రూ.14వేల కోట్లు) డిపాజిట్ చేసిందని, ఆమె ఇటీవలే చనిపోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఆ డబ్బును తన ఖాతాల్లోకి బదిలీ చేసుకునేందుకు తాను మలేషియా వెళ్తున్నానని, ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామంటూ వివరించాడు.
మలేసియాకు వెళ్తున్నానని చెప్పిన నైజీరియన్ ఈ నెల 9న ఆ యువతికి ఫోన్ చేసి, రూ.14వేల కోట్ల కరెన్సీ తన ఖాతాలోకి రావాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని, ఆస్ట్రేలియాలో ఉన్న తన స్నేహితుడు రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పాడని, రూ.2 లక్షలు ఇస్తే మిగిలిన డబ్బు మరొకరి వద్ద తీసుకుంటానని చెప్పాడు. అతడి మాటలను నమ్మిన బాధితురాలు రూ. 2 లక్షల నగదు నిందితుడు సూచించిన ఖాతాలో జమచేసింది.
రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి, అప్పు ఇస్తానన్నవ్యక్తి ఇవ్వలేదని మరో రూ.2 లక్షలు కావాలంటూ కోరగా ఆ మొత్తాన్ని పంపించింది. మే 14న మరోసారి యువతికి ఫోన్ చేసి మరో రూ. 2 లక్షలు సర్దితే. కేవలం మూడు గంటల్లో ఖాతాలో తిరిగి వేస్తానని నమ్మించాడు. యువతి వద్ద ఆ సమయంలో డబ్బు లేకపోయినా ఆమె బంగారు ఆభరణాలను అమ్మి డబ్బు జమ చేసింది.
పక్కరోజు ఫోన్ చేసి రూ. 30 వేలు తక్కువయ్యాయని ఎలాగైనా పంపించమంటూ బ్రతిమాలగా బ్యాంకులో ఉన్న నగదు నిల్వలు ఖాళీ చేసి రూ. 28 వేలు పంపించింది. పక్కరోజు ఆమె అతనికి ఫోన్ చేసి తన వద్ద ఒక్కరూపాయి కూడా లేదని నగదు పంపించమని కోరగా తాను ఇచ్చే పరిస్థితిలో లేనని, తనకే ఇంకా రూ. 3 లక్షలు కావాలని కోరాడు. పదే పదే డబ్బులు కావాలని కోరడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ అతనికి ఫోన్ చేయడం ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. దీంతో పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.