మతం కంటే మానవత్వం గొప్పదని ఓ వ్యక్తి నిరూపించాడు. సమాజంలో నీతి, నిజాయితీలు ఇంకా చావలేదని నిరూపిస్తూ, విలువలు ఇంకా బతికే ఉన్నాయనే దానికి తాజాగా జరిగిన ఓ సంఘటన రుజువు చేసింది. ఓ ముస్లిం వ్యక్తి మరో వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను కూడా వదిలేశాడు.
అత్యవసర పరిస్థితులలో ఉన్నటువంటి ఓ గర్భిణీ మహిళకు సహాయం చేయడానికి రాజస్థాన్‌కి చెందిన ఆ వ్యక్తి తన ఉపవాసాన్ని కూడా లెక్కచేయలేదు. సావిత్రి దేవి ఓ గర్భిణి. ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరపడడంతో అష్రఫ్ ఖాన్ అనే వ్యక్తి తన మతానికి సంబంధించి పవిత్రమైన ఆచారాన్ని కూడా వదిలేసి రక్తాన్ని దానం చేశాడు.
తమకు తెలిసినవారికి ఎవరికో బి నెగిటివ్ రక్తం కావాలంటూ వచ్చిన ఓ మెసేజ్ చూసిన అష్రఫ్ ఖాన్ వెంటనే స్పందించాడు. మెసేజ్‌లో అందించబడిన నంబర్ చూసి సదరు వ్యక్తికి కాల్ చేశాడు. అనంతరం పేషెంట్ ఉన్న ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. ప్రస్తుతం అష్రఫ్ చేసిన పనికి గానూ సమాజంలో ఆదర్శంగా నిలిచాడు.