Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమిలి ఎన్నికలకు జైకొట్టిన పార్లమెంట్ ప్యానెల్

Advertiesment
జమిలి ఎన్నికలకు జైకొట్టిన పార్లమెంట్ ప్యానెల్
, బుధవారం, 17 మార్చి 2021 (16:09 IST)
జమిలి ఎన్నికల అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వదిలిపెట్టటం లేదు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ, మోడీ ప్రభుత్వం చాలారోజులుగా ప్రతిపాదిస్తోంది. తాజాగా, ఈ ప్రతిపాదనకు పార్లమెంటరీ స్థాయీసంఘం మద్దతు కూడా లభించింది. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని, రాజకీయ పార్టీల వ్యయం కూడా దిగివస్తుందని, కాబట్టి వాటిని నిర్వహించటం మంచిదేనని పేర్కొంటూ నివేదికను సమర్పించింది.
 
కేంద్ర సిబ్బంది, న్యాయశాఖలకు సంబంధించి ఏర్పాటైన స్థాయీసంఘం ఈ నివేదికను రూపొందించింది. దీనిని మంగళవారం పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జమిలి ఎన్నికల వల్ల మానవ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని నివేదికలో స్థాయీసంఘం పేర్కొన్నది. తరచూ జరిగే ఎన్నికలతో ప్రజల్లో ఏర్పడిన అనాసక్తిని జమిలి ఎన్నికలతో తగ్గించవచ్చని, తద్వారా ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని అభిప్రాయపడింది.
 
దేశంలో జమిలి ఎన్నికలు కొత్తకాదని, తొలి మూడు సార్వత్రిక ఎన్నికలు (1952, 57, 62) జమిలి పద్ధతిలోనే జరిగాయని నివేదిక గుర్తుచేసింది. రాజ్యాంగానికి సవరణలు చేయడం ద్వారా మళ్లీ జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా లోక్‌సభ, ఆయా రాష్ట్రాల శాసనసభల గడువులను ఒకదానికొకటి సర్దుబాటు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నది. 
 
ఇందుకు పలు రాష్ట్రాల చట్టసభల గడువును పొడిగించడం లేదా తగ్గించడం చేయాల్సి ఉంటుందని, దీనికి రాజకీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరమున్నదని తెలిపింది. నిత్యం ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై భారం పడుతున్నదని, అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నదని పేర్కొన్నది. 1983లో ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. 
 
అనంతరం జస్టిస్‌ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్‌ కూడా ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపిందని గుర్తుచేసింది.
 వివిధ అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలు కూడా తమ నివేదికలను సమర్పించాయి. వాటిని ప్రభుత్వం పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టింది. 
భారత ప్రభుత్వ యంత్రాంగం ఒక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌పైనే అధికంగా ఆధారపడుతున్నదని ఒక పార్లమెంటరీ స్థాయీసంఘం తన నివేదికలో పేర్కొన్నది. 
 
అయితే ఆ సర్వీస్‌ పేరు మాత్రం వెల్లడించలేదు. పోక్సో చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించి బాలనేరస్థుల వయోపరిమితిని 18 నుంచి 16 ఏండ్లకు తగ్గించాలని మరో పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు చేసింది. సీబీఐకి మరిన్ని అధికారాలు కల్పించేందుకు చట్టాలను సవరించాలని ఇంకో పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటక మంత్రి రాసలీలల కేసు: యువతి ఆచూకీ లేదు, సూసైడ్ చేస్కుంటానంటూ వీడియో