భారతీయ జనతా పార్టీ నేతలకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృమమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గట్టి హెచ్చరిక చేశారు. తనతో పెట్టుకోవద్దని, ఒకవేళ తన జోలికి వస్తే మాత్రం మీ పునాదులు కదిలిస్తానంటూ హెచ్చరించారు. బెంగాల్ రాష్ట్రంలో తనకు సవాల్ విసరాలని చూస్తే మాత్రం దేశ వ్యాప్తంగా ఆ పార్టీ పునాదులు కదలిస్తానని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా 'ప్రత్యేక సమగ్ర సవరణ'కు వ్యతిరేకంగా బన్‌గావ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు ప్రసంగించారు. ఎన్నికల సంఘం ఏ మాత్రం నిష్పాక్షికంగా పనిచేయడం లేదని, అది భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘంగా మారిపోయిందని ఆరోపించారు.
ఎస్‌ఐఆర్ కారణంగానే బిహార్ ఎన్నికల ఫలితాలు ఆ విధంగా వచ్చాయని, అక్కడ భాజపా ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయన్నారు. ఒకవేళ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను తొలగించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమైతే.. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. అంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్రాల్లో చొరబాటుదారులు ఉన్నట్లు ఆ పార్టీ అంగీకరిస్తోందా? అని అన్నారు.
రాష్ట్రంలో మతువా మెజారిటీ ప్రాంతాల్లోని ఓటర్లు సీఏఏ కింద తమను తాము విదేశీయులుగా ప్రకటించుకుంటే వెంటనే ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగిపోతాయన్నారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా బయటకు వచ్చిన తర్వాత.. ఈసీ, భాజపా సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియను రెండు, మూడేళ్లపాటు నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పారు.
ఇదిలావుంటే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు. అపాయింట్‌మెంట్ కోరుతూ పార్టీ నేత డెరెక్ ఓబ్రియన్ చేసిన విజ్ఞప్తికి ఈసీ స్పందించింది. ఈ నెల 28న ఓ అధికార ప్రతినిధి, మరో నలుగురితో కూడిన బృందం తమను కలవొచ్చని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఓ లేఖ రాసింది. పార్టీలతో నిర్మాణాత్మక చర్చలను తాము ఎల్లప్పుడూ స్వాగతిస్తామని పేర్కొంది.