తన ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారని అందువల్ల తన అభిమానులు మరింత జాగ్రత్తగా ఉండాలని సినీ హీరోయిన్ అదితి రావు హైదరీ విజ్ఞప్తి చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోటోగ్రాఫర్లను సంప్రదిస్తూ ఫోటోషూట్‌ల గురించి మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు.
ఈ విషయంపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ ప్రకటన చేశారు. కొంతమంది నా దృష్టికి తెచ్చిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాట్సాప్‌లో ఎవరో నా ఫోటో పెట్టుకుని నేనే అన్నట్టుగా ఫోటోగ్రాఫర్లకు మెసేజ్‌లు చేస్తున్నారు. అది నేను కాదు. నేను వ్యక్తిగతంగా ఎవరినీ ఇలా సంప్రదించను. నా పనులన్నీ నా టీమ్ చూసుకుంటుంది అని స్పష్టం చేశారు.
అలాగే, దయచేసి ఆ నంబరుతో ఎవరూ మాట్లాడొద్దు. అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే నా టీమ్‌కు తెలియజేయండి. నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అదితి తన పోస్టులో పేర్కొన్నారు. అభిమానులు, సహచరులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అందువల్ల తన పేరుతో వచ్చే సందేశాలకూ ఏ ఒక్కరూ స్పందించవద్దని ఆమె తన అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను హెచ్చరించారు.