Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వండి: సిపిఎం

ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వండి: సిపిఎం
, సోమవారం, 20 ఏప్రియల్ 2020 (18:14 IST)
భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) గోదాముల్లో నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు మగ్గిపోకుండా ఈ కష్టకాలంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) ద్వారా అవసరమైన ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు ఆమె కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు లేఖ రాశారు. ప్రధానంగా పిడిఎస్‌ పంపిణీకి అవసరమైన ఆధార్‌, రేషన్‌కార్డులు వంటివి వలస కార్మికులకు ఉండవని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నిబంధనలను మినహాయించి వారందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కోరారు.

కార్మికవర్గంపై లాక్‌డౌన్‌ ప్రభావం అధికంగా పడిందని, లాక్‌డౌన్‌ సమయంలో, తరువాతి కాలంలో ప్రభుత్వం చేపట్టే చర్యలు వారి సమస్యలపై దృష్టిపెట్టేవిధంగా ఉండాలని డిమాండ్‌ చేశారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జిఒలు) ఇ-వేలంలో పాల్గొనకుండానే నేరుగా ఎఫ్‌సిఐ నుంచి ఒక ఫిక్స్‌డ్‌ రేటుకు బియ్యం, గోధుమలను కొనుగోలు చేసేందుకు అనుమతినిస్తూ ఆహార మంత్రిత్వశాఖ విధానాలు రూపొందించిందని గుర్తు చేశారు.

ఈ మేరకు ఏప్రిల్‌ 8న ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పిఐబి) జారీ చేసిన సమాచారంలో ఎన్‌జిఒలకు బియ్యాన్ని, గోధుమలను బహిరంగ మార్కెట్‌ విక్రయ పథకం (ఒఎంఎస్‌ఎస్‌) ధరలకు విక్రయించనున్నట్లు పేర్కొనడంపై బృందాకరత్‌ అభ్యంతరం తెలిపారు.

ఒఎంఎస్‌ఎస్‌ ప్రకారం గోధుమలు కిలో రూ.21.50, బియ్యం కిలో రూ.22.50గా ఉన్నాయని, ఇంత అధిక ధర నిర్ణయించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. గోదాముల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాల నిల్వలు మగ్గిపోయి చెడిపోతున్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసి రానున్న రబీ సీజన్‌కు సంబంధించి గోధుమ ఉత్పత్తికి గౌడోన్లలో ఖాళీ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఉపశమనం పేరిట స్టాక్‌ను ఖాళీ చేసేందుకు ఎన్‌జిఓ సంస్థలను అధిక ధరలకు విక్రయించాలనుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని, ఇది అనైతికమని కూడా బృందాకరత్‌ లేఖలో పేర్కొన్నారు. ఆహార ధాన్యాలను ప్రజలకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఆదాయం లేకుండా పోయిన కోట్లాది కుటుంబాలకు ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయాలని బృందాకరత్‌ డిమాండ్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జపాన్‌లో భూకంపం