దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. అలాగే కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది.
ముంబైలో ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. 167 మంది జర్నలిస్టుల శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్టులు నిర్వహించగా 53 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
53 మందిలో పలు వార్తా సంస్థలకు చెందిన రిపోర్టర్లు, ఫొటో జర్నలిస్టులు, కెమెరామెన్‌లు కూడా ఉన్నారు. ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
మరోవైపు చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులకు కరోనా సోకింది. మధ్యప్రదేశ్‌లో కూడా ఓ జర్నలిస్ట్‌కు కరోనా సోకిన నేపథ్యంలో జర్నలిస్ట్‌లకు కరోనా సోకడం చాలా దురదృష్టకరం అని భారత ప్రభుత్వం తెలిపింది.
జర్నలిస్ట్‌లు ఉన్న ప్రొటోకాల్స్ ఫాలో అవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. డ్యూటీకి హాజరైనప్పుడు జర్నలిస్ట్ లు అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, ఫేస్ మాస్క్ నిబంధనలు పాటించాలని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.