ప్రత్యక్ష యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర పన్నుతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. శనివారం 26/11 ముంబై పేళుళ్ల స్మారక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఫరీదాబాద్‌లోని ఉగ్ర మాడ్యూల్‌ను భద్రతా అధికారులు ఛేదించడంపై హర్షం వ్యక్తం చేశారు. మాడ్యూల్ నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కారణంగా ముంబైతో సహా అనేక నగరాల్లో ఉగ్రదాడులు జరగకుండా నిరోధించగలిగామని చెప్పారు.
యుద్ధంలో నేరుగా భారత్‌ను ఓడించలేని పాకిస్థాన్ ఇలాంటి ఉగ్రదాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఆ దేశమే కుట్ర పన్నిందన్నారు. అలాగే, భారత్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందన్నారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్బంగా ఉగ్రవాద ముప్పు ఇంకా కొనసాగుతోందని, అందువల్ల దేశ ప్రజలంతా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.