భారత టెలికాం రంగంలో 2016లో వచ్చిన జియో భారీ మార్పులను తీసుకొచ్చింది. మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని మాసాలకే ప్రముఖ సంస్థలతో పోటీ పడుతూ వినియోగదారుల చేరికలో ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్‌ను నెలకొల్పింది. అలాగే జియో ఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది.
సామాన్యులకు అందుబాటులో ఉండే ధరతో మొబైల్ సేవలను మరింత దగ్గర చేసింది. ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో క్వెర్టీ మోడల్‌ని కూడా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫీచర్లతో అందుబాటు ధరలో ఉండేలా స్మార్ట్‌ఫోన్‌ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మరికొన్ని నెలల్లో రిలయన్స్ వార్షిక సమావేశం జరగనుండగా జియోఫోన్ 3 ఆవిష్కరణపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
5 అంగుళాల టచ్ స్క్రీన్‌తో పాటు పవర్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ సాయంతో జియో ఫోన్ 3 చాలా స్మార్ట్‌గా ఆవిష్కృతం కానుంది. ఆండ్రాయిడ్ గో ఆధారంగా పని చేస్తూ, 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనున్నట్లు అంచనా.
అంతేకాకుండా 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్లు తెలుస్తోంది. ఇక జియో ఫోన్ ధర రూ.4,500కు ఉండవచ్చని అంచనా. ఈ యేడాది జూన్‌లో జరుగనున్న రిలయన్స్ జియో వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.