ప్రతిపక్షాల వ్యంగ్యాస్త్రాల భయమో లేక ఓటరు మహాశయులని మభ్య పెడుతున్నామన్న తడబాటో కానీ... ఆర్థిక శాఖ మంత్రివర్యులు తమ బడ్జెట్ ప్రసంగంలో చాలాసార్లు తడబడ్డారు...
వివరాలలోకి వెళ్తే... మంగళవారంనాడు బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన ప్రసంగంలో పలుమార్లు తడబడటం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. అయితే అందులోనే అనేక పదాలను తప్పుగా ఉచ్ఛరించడమూ జరిగింది. దాదాపు 25 పదాలను తప్పుగా ఉచ్ఛరించిన ఆయన సవాళ్లను.. శవాలుగానూ, యువతను యవతగా, కేటాయింపుల్ని కేటింపుగా, చర్చీల నిర్మాణాన్ని చర్చల నిర్మాణాలుగా, ప్రమాదాన్ని ప్రధమంగానూ చదవడం జరిగింది.
చక్కటి జీవనాన్ని.. చీకటి జీవనం అని సంభోదించారు. చివరకు ఆయన రోజూ ఉచ్ఛరించే దారిద్య్ర రేఖ, ప్రోత్సాహకాలు, కేంద్రీకృతం వంటి పదాలను సైతం తప్పుగా పలికారు. ఒక దశలో అయితే ఈ చర్య అనడానికి బదులు ఈ చర్మ అనేశారు కూడా. హాలిడేను హోలీడేగా, షీ టీమ్‌ను టీ టీమ్‌గా, వ్యవసాయాన్ని వ్యవస్థాగతంగా మార్చేసిన ఆయన కొన్నిసార్లు చదివిన లైన్లనే మళ్లీ చదవడం కూడా జరిగింది.
కింది లైన్లను పైన, పై వాటిని కింద చదివి మొత్తానికి కలగాపులగం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించిన యనమల ఆదిలోనే హంసపాదు అన్నట్లు పిల్లల బట్టల కుట్టుకూలిని.. కట్టుకూలి అంటూ తడబడి ఆ తడబాటు పరంపరని చివరి వరకు అలాగే కొనసాగించారు.