''తెనాలి రామకృష్ణ బీఏబీఎల్''లో అలాంటి పాత్ర చేశాను-హీరో సందీప్ కిషన్

శుక్రవారం, 15 నవంబరు 2019 (15:06 IST)
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘నేను వీడని నీడను నేనే’ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో నటుడిగా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో సందీప్‌ కిషన్. ప్రస్తుతం సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్‌.ఎన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, రూపా జగదీష్‌ ఈ సినిమాను నిర్మించారు. 
 
ఈ నెల 15న గ్రాండ్‌గా విడుదలైన సందర్భంగా హీరో సందీప్‌ కిషన్ ఇంట‌ర్వ్యూ.. 
 
కొంత విరామం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి కామెడీ ఫిల్మ్‌ చేస్తున్నట్టున్నారు?
– వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తర్వాత నేను పూర్తి స్థాయి కామెడీ ఫిల్మ్‌ చేయలేదు. కొంత విరామం తర్వాత ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ చిత్రంలో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండే పాత్ర చేశాను. నాకు వినోదం అంటే చాలా ఇష్టం కాబట్టి బాగా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమా చేశా. థియేట‌ర్‌లో ఆడియన్స్‌ రెండు గంటల ఎనిమిది నిమిషాలు పడి పడి నవ్వుతారు.
 
మీ క్యారెక్టర్ గురించి?
– ఈ సినిమాలో కెరీర్‌లో తొలిసారి లాయర్‌ పాత్ర చేశా. కర్నూల్‌ టౌన్‌లో ఈ కథ సాగుతుంది. కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పట్టుకుని కోర్టు బయట రాజీ చేయిస్తుంటా. అలాంటిది ఓ పెద్ద కేసుతో అనుకోని ఇబ్బంది వస్తుంది. దాన్ని ఎలా పరిష్కరించానన్నది చాలా ఆసక్తిగా ఉంటుంది. నా పాత్ర చాలా సరదాగా, నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. సింపుల్, స్వీట్‌ స్టోరీ ఇది. ఆడియన్స్‌కి థ్రిల్‌ కలిగించే అంశాలు ఉంటాయి.
 
డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి మేకింగ్ గురించి?
– నాగేశ్వర రెడ్డిగారు అంటేనే వినోదం. రాజసింహ ఇచ్చిన కథకు నాగేశ్వరరెడ్డి లాంటి క్లారిటీ ఉన్న దర్శకుడు దొరకడం అదృష్టం. ఆయన టైప్‌ కామెడీతో ప్రేక్షకుల్ని పడిపడి నవ్వేలా చేస్తుందీ సినిమా. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. కథలో కామెడీ ఉండాలి కానీ, కామెడీ కోసం కథ ఉండకూడదు. మా సినిమా కథలో కామెడీ ఉండే కోవలోకి వస్తుంది.
 
ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు?
– ప్రేక్షకులు నన్ను ఓ జానర్‌లో ఆదరించినప్పుడు వెంటనే మరో జానర్‌కి వెళ్లడంతో కొన్ని పరాజయాలు వచ్చాయి. అందుకే ప్రస్తుతం చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నా. మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఇంట్లో అయినా ఉంటాను కానీ, ఫ్లాప్‌ అయ్యే సినిమాలు మాత్రం చేయకూడదని నిర్ణయించుకున్నా.
 
వెబ్ సిరీసులు కంటిన్యూ చేస్తారా?
– హిందీలో ‘ది ఫ్యామిలీ మేన్‌’ అనే వెబ్‌ సిరీస్‌ తొలి భాగంలో మేజర్‌ విక్రమ్‌ పాత్రలో నటించా. చాలా మంచి స్పందన వచ్చింది. రెండో భాగంలో నేను ఉండను.. మూడో భాగంలో ఉంటా. తెలుగులోనూ గతంలో కంటే ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లు బాగా వస్తుండటం చాలా సంతోషంగా ఉంది.
 
హీరోగా, ప్రొడ్యూసర్ గా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? 
 
– ఓ సినిమా చేస్తున్నప్పుడే మూడు నాలుగు కథలు లాక్‌ చేసి పెట్టుకోవాలనుకోను. ఓ సినిమా విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం నా దృష్టంతా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ సినిమాపైనే ఉంది. తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హాకీ ప్లేయర్ గా కనిపిస్తాను. సాధారణంగా నేను సినిమాకు ముందు హోమ్ వర్క్ చేయను కానీ ఈ సినిమా కోసం హాకీ నిపుణుడి ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోబోతున్నా..
 
 నా బేనర్ లో నిర్మించిన ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం విజయం నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చింది. 
 
ఆ సినిమా విజయం ఇచ్చిన స్ఫూర్తితోనే నా ప్రొడక్షన్‌లో రాహుల్‌ రామకృష్ణ–ప్రియదర్శిలతో ఓ సినిమా నిర్మిస్తున్నా. ‘ది ఫ్యామిలీ మేన్‌’ తర్వాత బాలీవుడ్‌లో వెబ్‌ సిరీస్‌లకు, సినిమాలకు అవకాశాలొచ్చాయి. అయితే ప్రస్తుతం నా దృష్టి తెలుగు చిత్రాలపైనే. తమిళంలో నేను నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. అవి విడుదలయ్యాకే వేరే తమిళ సినిమాల గురించి ఆలోచిస్తా.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆర్థిక - అనారోగ్య కష్టాల్లో మెగా డైరెక్టర్.. చిరంజీవి ఆదుకునేనా?