చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి సోకిన వారికి ఎలా లక్షణాలుంటాయంటే.. ముందుగా జలుబు చేస్తుంది. ఆపై జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆపై చికిత్స అందకపోతే.. కిడ్నీ ఫెయిల్ కావడం, తీవ్రమైన న్యూమోనియాకు దారిస్తుంది. చలికాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా వుంటుంది.
ఇది సోకిన వాళ్లు తుమ్మినా, దగ్గినా వారి ద్వారా ఈ వైరస్ ఇతరుల శ్వాసకోశ నాళంలోకి ప్రవేశించడం ద్వారా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ పెంపుడు జంతువులతో పాటు, ప్రధానంగా పాముల నుంచి సంక్రమించినట్లు జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీ ప్రకటించింది. గాలి ద్వారా ఇతర ఇతరులకు సోకుతుంది. దీని బారినపడ్డ వారికి సన్నిహితంగా ఉన్నా ప్రమాదమే.
ఈ వ్యాధికి చికిత్స కానీ, అడ్డుకోగలిగిన వ్యాక్సీన్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవడమే అతి పెద్ద చికిత్సా మార్గం అంటున్నారు. ఇది సోకకుండా ఉండాలంటే, ఇతరులను, అపరిచితులను తాకకూడదు. ముఖ్యంగా ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకరాదు. నిత్యం మాస్కులు ధరించాలి. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండకూడదు. ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవాలి.