dవలపు వల (ప్రేమ) పేరుతో ఓ కిలేడీ లేడీ 36 మందిని బురిడీ కొట్టించింది. లోన్ పెట్టించి మరి వారితో ఫ్లాట్లు కొనిపించి, చివరకు పత్తా లేకుండా పోరిపోయింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ తరహా మోసం చైనా దేశంలో వెలుగు చూసింది. మీడియా కథనాల మేరకు..
లియుజియా అనే మహిళ డేటింగ్ పేరిట పలువురు యువకులను హనీట్రాప్ చేసింది. తనది హునాన్ ప్రావిన్స్ అని, షెన్‌జెన్‌లోని ఎలక్ట్రిక్ కంపెనీలో పని చేస్తున్నట్టు మాయమాటలు చెప్పింది. ఆమె మాటలు నమ్మిన అనేక మంది యువకులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెతో ప్రేమలోపడ్డారు. అయితే, తనను ప్రేమించే సమయంలోనే ఓ షరతు కూడా విధించింది.
తనతో రిలేషన్ ప్రారంభించాలన్నా, యువకుడి తల్లిదండ్రులను కలవాలన్నా ముందు ఒక ఇల్లు కొనాలన్నది ఆమె నిబంధన. అందుకు తాను కూడా ఆర్థికసాయం చేస్తానని నమ్మబలికింది. ఆమె బాధ్యతాయుత ప్రవర్తనకు మగ్ధులైన యువకులు ఆమె చెప్పినట్టుగా హుయ్‌జౌ, గాంగ్‌డాంగ్ ప్రాంతాల్లో తమకు నచ్చిన ఇళ్లను కొనుగోలు చేశారు.
ఆ తర్వాత ఆ యువతి పత్తా లేకుండా పోయింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన యువకులు లబోదిబోమంటున్నారు. తామంతా ప్రేమించింది ఒకే అమ్మాయినని తెలిసి ఖంగుతిన్నారు. కొద్ది రోజుల ప్రేమతో అప్పులపాలై చివరకు ఈఎంఐలు చెల్లించలేకపోతున్నట్టు వాపోతున్నారు. ఫ్లాట్లు అమ్మడం కోసం రియల్ ఎస్టేట్‌కు చెందిన సంస్థ వేసిన కుట్రలో తాము బలైపోయినట్టు వాపోతున్నారు.