Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Advertiesment
Director Vishwa Karun

దేవి

, శనివారం, 8 మార్చి 2025 (18:20 IST)
Director Vishwa Karun
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్,  ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. "దిల్ రూబా" సినిమా ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమా హైలైట్స్ తెలిపారు దర్శకుడు విశ్వకరుణ్
 
- మా స్వస్థలం తాడేపల్లిగూడెం, భీమవరంలో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. థియేటర్స్ లో మూవీస్ రెగ్యులర్ గా చూస్తుండేవాడిని. అలాగే పుస్తకాలు చదవడం చాలా ఇంట్రెస్ట్. నేను తెరపై చూసిన స్టార్స్, సినిమాలు నన్ను ప్రభావితం చేశాయి. అలా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాను. స్నేహితుడి ద్వారా నలదమయంతి అనే మూవీకి రైటింగ్ సైడ్ వర్క్ చేశాను. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఆ తర్వాత విజయేంద్రప్రసాద్ గారు రాసిన జాగ్వార్ మూవీకి వర్క్ చేశా. అలాగే దిల్ రాజు గారి బ్యానర్ లో రైటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. ఇలా జర్నీ సాగుతుండగా..ఓ రోజు కిరణ్ అబ్బవరం గారికి ఓ కథ చెప్పి కథ వరకు ఇచ్చేదామని వెళ్లాను. ఆయన కథ విని నచ్చలేదు గానీ నువ్వు కథ చెప్పిన విధానం బాగుంది. మరో మంచి సబ్జెక్ట్ ట్రై చేయి అన్నారు. అలా కొంతకాలం తర్వాత దిల్ రూబా కథను వినిపించా. కిరణ్ గారు వెంటనే మనం ఈ మూవీ చేస్తున్నాం బ్రదర్ అని అన్నారు. అలా దిల్ రూబా మూవీ సెట్స్ మీదకు వెళ్లింది.
 
- కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీకి ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేను. దర్శకుడిగా నేనే అన్ని క్రాఫ్టులు చూసుకోవాల్సిన టెన్షన్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో టైమ్ తీసుకో బ్రదర్..బాగా మూవీ చేయి అని ఎంకరేజ్ చేశారు. కిరణ్ గారు దర్శకత్వంలో ఇన్వాల్వ్ అవుతారనేది తప్పు. నా వర్క్ లో ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. అయితే కెరీర్ లో ఎదురుదెబ్బలు తిన్న ఎవరికైనా మంచి మూవీ చేయాలనే భయం ఉంటుంది. అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాం. కిరణ్ గారు చేసేది అదే. క మూవీ సక్సెస్ తర్వాత మరింత గ్రాండియర్ గా దిల్ రూబాను తీసుకురావాలని అనుకున్నాం ఆ క్రమంలో కొన్నిమార్పులు చేశాం గానీ మూలకథలో ఎలాంటి ఛేంజెస్ చేయలేదు.
 
- వెస్ట్రన్ కల్చర్ నుంచి మనం సారీ, థ్యాంక్స్ మాటలు చాలా త్వరగా అలవాటు చేసుకున్నాం. తెలుగులో క్షమించమని అడగలేము గానీ సారీ మాత్రం ఈజీగా చెప్పేస్తాం. తన తప్పు లేనప్పుడు సారీ ఎందుకు చెప్పాలనుకుంటాడు హీరో. ఇలాంటి వ్యక్తిత్వం వల్ల తనతో ఉన్నవారికి ఇబ్బంది ఉండొచ్చు. దిల్ రూబాలో కిరణ్ గారు చేసిన సిద్ధు క్యారెక్టర్ కూడా తన వ్యక్తిత్వం విషయంలో కాంప్రమైజ్ కాడు. క్యారెక్టర్ ను నమ్ముకుంటాడు. దాని వల్ల అతని లైఫ్ లో ఇబ్బందులు వస్తాయి.
 
- ప్రేమించిన అమ్మాయితో విడిపోయిన తర్వాత ఆ లవర్ ను శత్రువులా చూస్తుంటారు. కానీ ప్రేమ కంటే ముందు వారి మధ్య ఉండేది స్నేహమే. అదే స్నేహాన్ని విడిపోయిన తర్వాత కూడా పంచవచ్చు. బాగున్నావా అని ఫోన్ చేసి మన ఎక్స్ లవర్ ను అడగటంలో తప్పులేదు. దిల్ రూబా కథలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇటీవల వచ్చిన డ్రాగన్ మూవీకి మా దిల్ రూబాకు సంబంధం లేదు. మా మూవీ ట్రీట్ మెంట్ వేరుగా ఉంటుంది. ప్రేమ కథలన్నీ ఒకటే మనం వాటిని తెరపై చూపించే విధానమే కొత్తగా ఉండాలి. అలాంటి కొత్త తరహా ప్రేమ కథను దిల్ రూబాలో చూస్తారు.
 
- సంగీత దర్శకుడు సామ్ సీఎస్ గారు ఎంతో బిజీగా ఉంటారు. అయినా నాలాంటి కొత్త దర్శకుడు కథ చెబుతానని వెళ్తే టైమ్ ఇస్తారు. ఈ సినిమాలోని పాటలకు సందర్భం చెప్పామంతే ఆయన బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. బీజీఎం మా మూవీకి ఆకర్షణగా నిలుస్తుంది. భాస్కరభట్ల గారిని గురువు గారు అని పిలుస్తా. ఆయన మా మూవీకి మంచి లిరిక్స్ ఇచ్చారు. అర్జెంట్ లిరిక్స్ కావాల్సిన వచ్చినప్పుడు నేనూ ఓ పాట రాశా. మనం చూసిన మనషులు, సందర్భాలే ఏ కథకైనా స్ఫూర్తినిస్తాయి. దిల్ రూబా టైటిల్ వినగానే క్యాచీగా ఉంది. టైటిల్ లో ఒక మంచి సౌండ్ ఉంది అనిపించింది.
 
- క మూవీ కంటే ముందే దిల్ రూబా మొదలైంది. అయితే ఇందులో ఇతర భాషలకు చెందిన ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లు బిజీగా ఉండటం వల్ల మా షూటింగ్ కొంత ఆలస్యమైంది. ఇద్దరు హీరోయిన్స్ రుక్సర్, క్యాతీ డేవిసన్ కు మంచి రోల్స్ ఉన్నాయి. వారి పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. మొదట వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో దిల్ రూబా చేయాలని అనుకున్నాం అయితే మంగుళూరులో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయని తెలిసి అక్కడ షూట్ చేశాం. నేను రైటర్ ను కాబట్టి పర్పెక్ట్ గా స్క్రిప్ట్ చేసి నెక్స్ట్ మూవీకి రెడీ అవ్వాలని అనుకుంటున్నాను. దిల్ రూబా ఈ నెల 14న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత కొత్త మూవీకి సన్నద్ధమవుతా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి