వైకాపా నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళి విజయవాడ కోర్టు జడ్జి వద్ద బోరున విలపించారు. తనపై అక్రమ కేసులు బనాయించి, రాష్ట్రమంతా తిప్పుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులన్నీ ఇంచుమించు ఒకేవిధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పైగా, ఇవన్నీ అక్రమ కేసులేనని తెలిపారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని జడ్జికి వివరించారు.
మరోవైపు విజయవాడ కోర్టు పోసానికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్‌పై పోసానిని కర్నూలు జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి, ఆ తర్వాత విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు. కాగా, జనసేన పార్టీ నేత శంకర్ ఫిర్యాదు మేరకు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైన విషయం తెల్సిందే.
ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్న జగన్ అండ్ కో : టీడీపీ నేతల కౌంటర్
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఓర్వలేని జగన్ అండ్ కో విషం కక్కుతోందని టీడీపీ ఘాటుగా కౌంటరిచ్చింది.
ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన టీడీపీ కూటమి అధికారం చేపట్టాక మాటమార్చారంటూ సీఎం చంద్రబాబుపై వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పి ఇపుడు జిల్లా పరిధిలోనే ఉచితమని కొర్రీలు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆంక్షలు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు.
వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. తొలి నుంచి జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తమ నేత హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియోతో వైకాపా నేతలకు కౌంటర్ ఇచ్చారు.
జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రీగా ప్రయాణించవచ్చని టీడీపీ చీఫ్ చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇపుడు ఆ హామీని అమలు చేస్తోంది. ఈ హామీతో మహిళలకు మేలు జరగడం ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నారు అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.