తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 23 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఓ విద్యా సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దీంతో 23 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు విద్యార్థినులే ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారు.
ఈ బాంబు దాడి వెస్ట్ కాబూల్ దాష్త్ ఏ బర్చీ అనే ఏరియాలోని కాజ్ ఎడ్యుకేషనల్ సెంటరులో భారీ విస్పోటనంతో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.
ఈ పేలుడు ధాటికి చనిపోయిన వారిలో అత్యధికులు మైనారిటీకి చెందిన హజారాకు తెగకు చెందిన వారిగా గుర్తించారు. ఆప్ఘనిస్థాన్‌లో హాజారాలు(షియా తెగ ప్రజలు) మైనార్టీలుగా పరిగణిస్తారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వీరిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడులు జరుగుతున్నాయి.
అయితే, తాజాగా జరిగిన బాంబు దాడికి ఏ సంస్థా కూడా నైతిక బాధ్యత వహించలేదు. దాడి జరిగిన సమయంలో విద్యా సంస్థలో దాదాపు 500 మందికిపైగా చిన్నారులు ఉన్నారు.