Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకృష్ణుడు గురుదక్షిణ ఎవరికిచ్చాడు..?

శ్రీకృష్ణుడు గురుదక్షిణ ఎవరికిచ్చాడు..?
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (15:49 IST)
విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు గురుదక్షిణ సమర్పించుకోవాలి. అలా చేయకపోతే నేర్చుకున్న విద్యకు అర్థం పరమార్థం ఉండదు. అందుకే పురాణాలలో చాలా మంది శ్రేష్టులు గురుదక్షిణ సమర్పించినట్లు మనం కథనాల్లో విని ఉన్నాము. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీ కృష్ణుడు సైతం గురువు దగ్గర విద్యనభ్యసించి దురుదక్షిణ సమర్పించుకున్నాడు. 
 
విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నతుడు కావాలని బాలకృష్ణుడు సాందీపుని ఆశ్రమంలో చేరాడు. సాందీపుడు మహర్షులలో పేరెన్నికగన్నవాడు. సాందీపుని ఆశ్రమంలోని ఇతర శిష్యులతో కలిసి ఆశ్రమానికి అవసరమైన సేవలు చేసి గురుశుశ్రూషలో తరించాడు బాలకృష్ణుడు. సాందీపుని శిక్షణలో బాలకృష్ణుడు సకల శాస్త్ర విద్యా పారంగతుడయ్యాడు. 
 
గురు సన్నిధిని వీడి రాజవాసానికి చేరుకునే సమయం ఆసన్నమైంది. విద్యను నేర్పిన గురువుకు ధన్యవాదాలు తెలియచేసుకునే క్రమంలో గురుదక్షిణ చెల్లించుకోవాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడు. గురువుకు సంతృప్తిని కలిగించేది ఏదైనా అందించాలని నిర్ణయించుకున్న బాలకృష్ణుడు, అదే విషయాన్ని సాందీపుని ముందు ఉంచాడు. గురుదక్షిణ ఏది కావాలో అడగండని శ్రీకృష్ణుడు తెలుపగానే గురుపత్ని కన్నీరుమున్నీరు అయ్యింది. ప్రభాస తీర్థంలో తప్పిపోయిన తమ కుమారుడిని తీసుకురమ్మని ఆమె కోరింది. 
 
గురుపత్ని కోరిక కష్టసాధ్యమైనప్పటికీ శ్రీకృష్ణుడు వెరవలేదు. ప్రభాస తీర్ధం వద్ద గల సముద్రంలో స్నానం చేస్తున్న సాందీపుని కుమారుడిని పాంచజన్యమనే పేరు కలిగిన రాక్షసుడు అపహరించుకుపోయాడు. పాంచజన్యునితో పోరాటం జరిపిన శ్రీకృష్ణుడు అతనిని తుదముట్టించాడు. సాందీపుని కుమారుని తీసుకువచ్చి సాందీపునికి అప్పగించి తన గురుభక్తిని చాటుకున్నాడు. ఆ విధంగా వెలకట్టలేని గురుదక్షిణ చెల్లించుకున్నాడు శ్రీకృష్ణుడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాది రోజు ఈ పని మాత్రం చేయకండి..