ఉగాది పండుగను భక్తి ప్రపత్తులతో చేసుకుంటాం. మనమందరం తెలుగు సంవత్సరాదిని ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఈ పండుగకు ఉగాది, యుగాది అనే పేరు కూడా వుంది. కలియుగ ప్రారంభం ఉగాది రోజునే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి.
తెలుగు భాష మాట్లాడే వారందరూ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. చాంద్రమానంలో చైత్రమాసం తొలి మాసం. ఈ చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యమి రోజున ఉగాది పండుగను అట్టహాసంగా జరుపుకుంటాం.
అలాంటి పవిత్రమైన రోజున అందరూ బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేవాలి. ఉగాది రోజున బ్రహ్మ ముహూర్తానికి తర్వాత నిద్రలేవటం కూడదు. సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించాలి. అలాగే సూర్యోదయానికి ముందే పూజ చేయడం మంచి ఫలితాన్నిస్తుందని పండితులు చెప్తున్నారు. సూర్యోదయానికి ముందే ఉగాది రోజున చేసే పచ్చడిని నైవేద్యంగా సమర్పించి తినాలని వారు సూచిస్తున్నారు.
కాబట్టి ఉగాది రోజున బ్రహ్మ ముహూర్త కాలంలో స్నానం, పూజ, నైవేద్యం పూర్తి చేయాలి. బ్రహ్మ ముహూర్త కాలంలో నువ్వుల నూనెతో మర్దన చేసుకుని, ఆపై ఆ రోజున నీటి యందు గంగాదేవి ఆవహించి వుండటం చేత అభ్యంగన స్నానమాచరించాలి. తర్వాత ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి.. ప్రసాదంగా స్వీకరించే వారికి ఆ సంవత్సరమంతా సౌఖ్యదాయకంగా వుంటుంది.
అంతేకానీ సూర్యోదయానికి తర్వాత నిద్రలేవడం చేయకూడదు. శుచిగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి.. పంచాంగ శ్రవణం వినాలి. ఆపై ఆలయ సందర్శన చేయాలని పండితులు అంటున్నారు.