Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24 గంటల్లో 14 వేల కరోనా వైరస్‌ కేసులు : డబ్ల్యూహెచ్ఓ

24 గంటల్లో 14 వేల కరోనా వైరస్‌ కేసులు : డబ్ల్యూహెచ్ఓ
, మంగళవారం, 17 మార్చి 2020 (14:07 IST)
కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 162 దేశాలకు వ్యాపించింది. సుమారుగా రెండు లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఆరు వేల మందికిపైగా చనిపోయారు. ఈ పరిస్థితుల్లో గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 వేల కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. సోమవారం ఒక్క రోజే 862 మంది చనిపోయారని తెలిపింది.
 
ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 1,67,500కి పెరిగిందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,606కు పెరిగిందని... గత 24 గంటల్లో 862 మంది చనిపోయారని తెలిపింది. భారత్‌తో పాటు 130 దేశాలకు ఈ వైరస్ పాకిందని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
మరోవైపు దేశంలో కరోనా విస్తరిస్తుండటంతో అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచనలు జారీ చేసింది. సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు, మ్యూజియంలు, జిమ్‌లు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులను మూసివేయాలని ఆదేశించింది. విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాలని, ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించాలని తెలిపింది. ప్రజలు ఒకరికొకరు దూరంగా ఉండటమే మేలని చెప్పింది.  
 
భారత్‌లో వైద్యుడికి కరోనా 
మరోవైపు, ప్రతి ఒక్కరూ భయపడుతున్నట్టే మన దేశంలో కరోనా మహమ్మారి నెమ్మదిగా వ్యాపిస్తోంది. మన దేశంలో కరోనా సోకిన తొలి వ్యక్తికి చికిత్స చేసిన డాక్టర్ కూడా ఆ మహమ్మారి బారిన పడ్డారు. కర్ణాటక కలబుర్గీకి చెందిన 76 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చారు. కరోనా కారణంగా ఆయన మృతి చెందారు. 
 
దేశంలో కరోనా కారణంగా చనిపోయిన తొలి వ్యక్తి ఈయనే. ఈయనకు చికిత్స చేసిన కలబుర్గీకి చెందిన 63 ఏళ్ల డాక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయనను కుటుంబసభ్యులు ఏకాంతంగా ఒక గదిలో ఉంచారు. అనంతరం ఆయనను ఐసొలేషన్ వార్డుకు తరలించారు. ఈ విషయాన్ని కలబుర్గీ డిప్యూటీ కమిషనర్ శరత్ వెల్లడించారు.
 
మరో మృతి.. మహారాష్ట్రవాసి  
దేశంలో కరోనా వైరస్‌తో మరొకరు మృతి చెందారు. ఈ వైరస్‌ కారణంగా దేశంలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (64) మంగళవారం మృతి చెందడంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది.
 
అతడు మృతి చెందినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో మహారాష్ట్ర సర్కారు మరింత అప్రమత్తమైంది. అధికారులకు సీఎం ఉద్ధవ్‌ థాకక్రే పలు ఆదేశాలు ఇచ్చారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ వ్యాక్సీన్‌ అభివృద్ధిలో ముందడుగు, ఓ మహిళకు ప్రయోగాత్మకంగా ఇంజెక్ట్ చేసిన శాస్త్రవేత్తలు