దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మాత్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అలాగే, ప్రైవేట్ సంస్థలు, ఐటీ కార్యాలయాలు, దేవాయల బోర్డులు కూడా ఈ తరహా నిబంధనలనే పాటిస్తున్నాయి. అయితే, కొందరు మరింతగా అతి జాగ్రత్తలకు వెళుతున్నారు. ఇలాంటివి వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఇస్కాన్ నిర్వాహుకులు కూడా ఇదే తరహా అతి చర్యలకు పాల్పడ్డారు. అల్పాహారం తినేందుకు వెళ్లిన కొందరి చేతులపై గోమూత్రం చల్లారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని జుహూ ప్రాంతంలో ఇస్కాన్ మందిరం ఉంది. ఈ ఇస్కాన్ పరిధిలో గోవిందా రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్‌కు ప్రతి రోజూ వందల సంఖ్యలో ముంబై వాసులు అల్పాహారం ఆరగించేందుకు వస్తుంటారు.
ఈ క్రమంలో కరోనా వైరస్ పుణ్యమాని మందిరంలో శానిటైజర్ బాటిల్ పెట్టారు. ఈ రెస్టారెంట్‌కు వచ్చే వారు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుని వెళ్ళాలి. అయితే, ఈ శానిటైజర్ అయిపోయింది. ఈ కారణంతో, గోమూత్రంతో అక్కడికి వచ్చిన భక్తుల చేతులు శుభ్రం చేశారు. అదికూడా ఇస్కాన్ పరిధిలో ఉన్న గోవిందా రెస్టారెంట్ ప్రాంగణంలోనే ఈ తంతు జరిగింది.
ఈ విషయాన్ని రాజూ నాయర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. తన స్నేహితునితో కలిసి ఇస్కాన్ ఆలయం లోపల ఉన్న గోవిందా రెస్టారెంట్‌కు వెళ్లగా, తనిఖీల తర్వాత చేతులు చూపాలని చెప్పిన సిబ్బంది, దానిపై ఏదో స్ప్రే చేశారు. అది చాలా దుర్వాసనగా ఉన్నట్టు అనిపించగా, రాజు, ఏమిటని అడిగారు. దీనికి వారిచ్చిన సమాధానం విని అవాక్కయ్యాడు.
చెప్పకుండా గోమూత్రాన్ని చేతులపై స్ప్రే చేయడం ఏంటని నిలదీయగా, కొందరు దీన్ని తాగుతుంటారు కూడా అంటూ పొగరుగా సమాధానం ఇచ్చారు. తనకు గోమూత్రంతో చేతులు కడుక్కోవడం ఇష్టం లేదని, తన వద్ద శానిటైజర్ ఉంటుందని, తాను ఆలయానికి వెళ్లలేదని, కేవలం రెస్టారెంట్‌కు తినేందుకే వెళ్లానని రాజూ నాయర్ చెప్పారు.
కానీ, ఇక్కడి రెస్టారెంట్‌లో తన మనోభావాలకు విరుద్ధంగా సిబ్బంది ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఈ విషయం వైరల్ కావడంతో ఆలయ అధికారి ఒకరు స్పందిస్తూ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయంలోని పలు చోట్ల శానిటైజర్లను ఏర్పాటు చేశామని, గోవిందా రెస్టారెంట్ వద్ద ఉన్న శానిటైజర్ అయిపోవడంతో, గోమూత్రాన్ని వినియోగించామని అన్నారు.