దేశంలో 129కి చేరిన కరోనా కేసులు.. 162 దేశాలకు వ్యాప్తి

మంగళవారం, 17 మార్చి 2020 (11:14 IST)
కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే 162 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న ఈ వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు  182547 మందికి ఈ వైరస్ సోకింది. అలాగే, 7164 మంది మృత్యువాతపడ్డారు. ఈ మృతుల్లో చైనాలో 3226 మంది, ఇటలీలో 2158 మంది, స్పెయిన్‌లో 342 మంది గరిష్టంగా చనిపోయారు. 
 
మరోవైపు, మన దేశంలో మంగళవారం ఉదయానికి కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 129కి చేరింది. సోమవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కర్నాటకలోనే మొత్తం 10 మందికి ఈ వైరస్ సోకినట్టు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇటీవలే యూకే నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారు.  
 
నాగ్‌పూర్‌లో 144 సెక్షన్  
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 
 
వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నాగపూర్ మరో అడుగు ముందుకు వేసింది. 144 సెక్షన్ విధించింది. పోలీస్ జాయింట్ కమిషనర్ రవీంద్ర కందం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు. 
 
ఈ వైరస్ వ్యాప్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, ఏ పట్టణాన్ని పూర్తిగా నిర్బంధించే ఉంచే ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే, ప్రతి ఒక్కరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలకు గుంపుగా వెళ్లొద్దన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో వచ్చే 20 రోజులు ఎంతో కీలకమని, ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు.
 
ఫీవర్ ఆస్పత్రికి 14 మంది అనుమానితులు 
విదేశాల నుంచి వచ్చిన 8 మంది సహా మొత్తం 14 మంది హైదరాబాద్, నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో చేరిన వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
ఆసుపత్రిలో చేరిన వారిలో నగరంలోని వారాసిగూడకు చెందిన యువకుడు (27), అంబర్‌పేటకు చెందిన 24 ఏళ్ల యువతి, ఇండోనేషియా నుంచి ఇటీవల కరీంనగర్ వచ్చిన 8 మంది ఉన్నారు. వీరిలో 30 ఏళ్ల లోపు వయసున్న యువకులు నలుగురు, 64 ఏళ్ల లోపు వయసున్న వారు నలుగురు ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
 
అలాగే, సైదాబాద్‌కు చెందిన ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. కాగా, సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 938 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. వీరిలో 27 మంది పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కళ తప్పిన బులియన్ మార్కెట్.. బంగారం ధరలు నేలచూపు