దేశంలో మరో కరోనా మరణం... మూడుకు చేరిన మృతులు

మంగళవారం, 17 మార్చి 2020 (12:10 IST)
కరోనా వైరస్ బారినపడిన రోగి మరణించాడు. దేశంలో కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. తాజాగా ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కస్తూర్భా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. 
 
ఇప్పటివరకు ఢిల్లీలో ఒకరు, కర్ణాటకలో మరొకరు మృతి చెందారు. ముంబైలో ఈ వ్యక్తి మృతితో ఈ సంఖ్య మూడుకు చేరింది. ముంబైలో వ్యక్తి మరణించాడని తెలియగానే మహారాష్ట్రలో కలవరం మొదలైంది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 130కు చేరింది. 
 
మహారాష్ట్రలో వైరస్‌ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోనులో మాట్లాడారు. వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోడీకి సీఎం ఉద్ధవ్ ఠాక్రే వివరించారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ముంబైలోని రైల్వే అధికారులు.. లోకల్‌ రైళ్ల డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చర్యలు చేపట్టారు.
 
కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో క్వారంటైన్‌లో ఉంటూ చనిపోయిన మహారాష్ట్ర వాసికి వైరస్‌ నెగెటివ్‌ అని తేలింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 125కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజులోనే 26 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. తెలంగాణలో కొత్తగా మరో కేసు నమోదైంది. నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌వాసికి వైరస్‌ సోకినట్లుగా పరీక్షలో తేలింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దేశంలో 129కి చేరిన కరోనా కేసులు.. 162 దేశాలకు వ్యాప్తి