Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరు సూత్రాలు పాటించండి.. కరోనాకు దూరంగా ఉండండి.. 'ఆర్ఆర్ఆర్' హీరోలు (Video)

ఆరు సూత్రాలు పాటించండి.. కరోనాకు దూరంగా ఉండండి.. 'ఆర్ఆర్ఆర్' హీరోలు (Video)
, మంగళవారం, 17 మార్చి 2020 (11:38 IST)
టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేంద్రంతో పాటు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అనేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ అవగాహనా ప్రచారాల్లో అనేక మంది సెలెబ్రిటీలు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ కోవలో ఇపుడ తెలుగు హీరోలు ఎన్టీఆర్ - రాంచరణ్‌లు తమ వంతుగా ఓ ప్రచార అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. 
 
 
వీరిద్దరూ కలిసి ఓ వీడియోలో కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలన్న విషయమై ఫ్యాన్స్‌కు, ప్రజలకు కొన్ని టిప్స్ చెప్పగా, ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. వైరస్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీరు వివరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ ఆరు సూత్రాలను చెప్పిందని, వీటిని పాటిస్తే, సులువుగా తప్పించుకోవచ్చని అన్నారు. ఇందుకోసం వారు ఆ వీడియోలో మాట్లాడిన మాటలను పరిశీలిస్తే, 
 
రాం చరణ్: డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ ఆరు సూత్రాలను పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం.
 
ఎన్టీఆర్: చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లో కూడా. బయటికి వెళ్లివచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకు 7, 8 సార్లు.
 
రాం చరణ్: కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్లు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి.
 
ఎన్టీఆర్: మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్‌లు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్ -19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతులు అడ్డుపెట్టుకోకుండా, మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి మోచేతిని.
 
రాం చరణ్: జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్లకండి. మంచినీళ్లు ఎక్కువ తాగండి. గడగడ ఒకేసారి తాగేకన్నా..  ఎక్కువసార్లు కొంచెం కొంచెం తీసుకోండి. వేడినీళ్లు అయితే ఇంకా మంచిది.
 
ఎన్టీఆర్: వాట్సప్‌లో వచ్చే ప్రతీ వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజం ఎంతో తెలియకుండా ఫార్వార్డ్ చేయకండి. అనవసరంగా పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. డబ్ల్యూహెచ్ఓ వెబ్‌సైట్‌లో సూచనలు ఇస్తుంటారు. వాటిని ఫాలో అవుదాం. 
 
రాం చరణ్: కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే రక్షించుకుందాం. 
 
ఎన్టీఆర్: స్టే హైజీనిక్ (పరిశుభ్రత పాటించండి) 
 
రాం చరణ్: స్టే సేఫ్ (సురక్షితంగా ఉండండి). 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వీయ నిర్బంధంలో బాలీవుడ్ దిగ్గజం.. గదిలో ఏకాంతంగా...