దేశీయంగా బంగారం ధరలు ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో పసిడి ధర సరికొత్త చరిత్రను సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.1.23 లక్షలు పలికింది. ఒక్క రోజే ఒక గ్రాము బంగారంపై ఏకంగా రూ.2,700 మేర పెరగడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఇప్పటివరకూ నమోదైన రికార్డు స్థాయి ధర కావడం గమనార్హం.
అలాగే, వెండి ధరలు కూడా బంగారం ధరల బాటలోనే పయనిస్తున్నాయి. కిలో వెండి ధర రూ.7,500 పెరిగి రూ.1.57 లక్షలకు చేరుకుంది. ఈ ధర పెరుగుదల వెనుక పలు జాతీయ, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర రూ.2,600 డాలర్ల స్థాయిని దాటడం ఇత్యాది కారణాలు దేశీయ ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. దీనికితోడు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కూడా దిగుమతులపై భారం పెంచి దేశీయంగా ధరలు పెరగడగానికి దారితీసింది.
భౌగోళిక, రాజకీయ పరిస్థితులకుతోడు దసరా, దీపావళి పండుగల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు స్టాక్ మార్కెట్లో అస్థిరతతో చాలా మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.