ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ నెట్వర్క్‌ను రాబోయే 6 నుంచి 8 నెలల్లోనే 5జీకి అప్ గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఈ మార్పుతో త్వరలోనే బీఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ఢిల్లీలో జరిగిన 'కౌటిల్య ఎకనామిక్ సదస్సు 2025'లో ఆయన మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. భారతదేశం తన సొంత 4జీ ప్రమాణాలతో సాంకేతిక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని, ఇది దేశ ఆవిష్కరణ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. "ఇంతటితో మేము ఆగిపోము. రాబోయే 6-8 నెలల్లో ఈ 4జీ టవర్లను 5జీ నెట్‌వర్క్ మారుస్తాం. దేశవ్యాప్తంగా ఎండ్-టు-ఎండ్ 5జీ సేవలను అందిస్తాం" అని సింధియా స్పష్టం చేశారు.
గత నెలలో బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన 'స్వదేశ్ 4జీ నెట్‌వర్' లేదా భారత్ టెలికాం స్టాక్‌ను పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, తేజస్ నెట్ వర్క్స్ లిమిటెడ్ సహకారంతో ఈ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఘనతతో, సొంతంగా టెలికాం టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐదు దేశాల సరసన భారత్ చేరిందని ఆయన గుర్తుచేశారు.