ఏపీలోని విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో జరిగిన విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారికి వేడుకలు నిర్వహించారు. ఇందులో తన భార్యతో కలిసి డ్యాన్స్ వేసిన భర్త.. కొన్ని క్షణాల్లోనే అనంతలోకాలకు చేరుకున్నాడు. ఈ విషాదకర ఘటన పెందుర్తిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
పెందుర్తి మండలంలోని పెదగాడి గ్రామానికి చెందిన అప్పికొండ త్రినాథ్ (56) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో తన భార్య లక్ష్మీతో కలిసి త్రినాథ్ నృత్యం చేశాడు. పాట పూర్తయిన వెంటనే త్రినాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
దీంతో గ్రామస్థులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, త్రినాథ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో పండుగ వేళ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, డీజే శబ్దాలకు త్రినాథ్ గుండె ఆగివుంటుందని గ్రామస్థులు అనుకుంటున్నారు.